రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ తగదు - కాకాణి

Jun 26, 2026 - 19:03
Jun 26, 2026 - 19:07
 0  32
రామాయపట్నం  పోర్టు   ప్రైవేటీకరణ తగదు  - కాకాణి

రామాయ పట్నం  పోర్టు  ప్రైవేటీకరణ  తగదని  మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు  కాకాణి గోవర్ధన్  రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన  మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన అవకాశాల్లో పోర్టు ఆధారిత అభివృద్ధి ఒకటి. ఈ సామర్థ్యాన్ని గుర్తించిన వైసీపీ  ప్రభుత్వం రామాయపట్నం, ములపేట, మచిలీపట్నం అనే మూడు నాన్-మేజర్ పోర్టుల అభివృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా, వాటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణను కూడా విజయవంతంగా పూర్తి చేసింది.అయితే, అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే తన విధానంలో భాగంగా ఇప్పుడు రామాయపట్నం పోర్టును కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం నిన్న విడుదల చేసిన జీవో ద్వారా DBFOT (Design, Build, Finance, Operate and Transfer) విధానంలో డెవలపర్ ఎంపిక కోసం RFP విడుదలకు అనుమతి ఇచ్చింది.ఈ నిర్ణయం పూర్తిగా అనుచితమైనది. ఎందుకంటే 2024 ఫిబ్రవరిలోనే ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక సమీకరణ పూర్తయింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) రూ.3,938.10 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. అంతేకాకుండా, 2024 ఫిబ్రవరి 16న విడుదలైన జీవో నెం.6 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆ రుణానికి గ్యారంటీ కూడా ఇచ్చింది.జీవో నెం.6లో ఈ పోర్టును "ఓన్ ఆపరేషన్స్ మోడల్" (Own Operations Model)లో నిర్వహించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విధానం వల్ల ప్రాజెక్టు ఆర్థికంగా మరింత బలపడింది. ప్రభుత్వ ఈక్విటీ వాటా తక్కువగా ఉండటంతో, 80:20 రుణ–ఈక్విటీ నిష్పత్తిలో PFC నుంచి రుణం లభించింది.ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.4,929 కోట్లు. ఇందులో PFC రుణం రూ.3,938.10 కోట్లు, ప్రభుత్వ ఈక్విటీ వాటా కేవలం రూ.991 కోట్లు మాత్రమే. ఈ మొత్తం ఆర్థిక నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం ఖరారు చేసి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి టీడీపీ ప్రభుత్వానికి అప్పగించింది.ఇలాంటి పరిస్థితుల్లో, ప్రభుత్వం కేవలం రూ.991 కోట్ల ఈక్విటీ కూడా పెట్టడానికి సిద్ధంగా లేకుండా, మళ్లీ ప్రైవేటు డెవలపర్‌ను ఆహ్వానించడం ఆశ్చర్యకరం. ఇప్పటికే ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తయిన ప్రాజెక్టుకు మళ్లీ డిజైన్ మరియు ఫైనాన్స్ పేరుతో DBFOT విధానంలో టెండర్లు పిలవడం హాస్యాస్పదంగా ఉంది.ప్రైవేటు సంస్థల ప్రధాన లక్ష్యం ప్రజా ప్రయోజనం కాదు, లాభార్జన మాత్రమే. ఉపాధి కల్పన, కార్గో వైవిధ్యీకరణ, ప్రాంతీయ అభివృద్ధి, దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలు వంటి అంశాలకు అవి ప్రాధాన్యం ఇవ్వవు. దీనివల్ల భవిష్యత్తులో రాష్ట్రానికి భారీ ఆదాయం తీసుకురాగల బలమైన ప్రభుత్వ రంగ సంస్థను ఆంధ్రప్రదేశ్ కోల్పోయే ప్రమాదం ఉంది.టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి కాకుండా, ప్రైవేటు సంస్థలకు అప్పగించి కాంట్రాక్టుల ద్వారా అధికార పార్టీ పెద్దలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకువచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రజల డబ్బుతో రూపుదిద్దుకున్న రామాయపట్నం పోర్టు ప్రజల ఆస్తి. దానిని ప్రభుత్వ ఆధీనంలోనే పూర్తి చేసి, ప్రభుత్వ నిర్వహణలోనే అభివృద్ధి చేయాలి. రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కాకాణి గో వర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow