పొగాకు కొనుగోలు చేయకుండా ఉద్దేశ పూర్వకంగా తిరస్కరిస్తే కఠిన చర్యలు
పొగాకు కొనుగోలు చేయకుండా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తే ( నో బిడ్ ) కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి .రాజాబాబు హెచ్చరించారు. కొనుగోలు తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దగ్గర ప్రత్యేకంగా సమావేశం జరిగిన తర్వాత కూడా కంపెనీల ధోరణిలో మార్పురాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పొగాకు బేలును కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. శనివారం ఆయన ఒంగోలు - 1, ఒంగోలు - 2 పొగాకు వేలం కేంద్రాలను తనిఖీ చేశారు. పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీతో కలిసి వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. రైతులతోనూ, కొనుగోలుదారులతోనూ ఈ సందర్భంగా ఆయన చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు కంపెనీలు ఇష్టానుసారంగా తిరస్కరిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇక్కడ 140 మిలియన్ టన్నుల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇస్తే, రైతులు 230 మిలియన్ టన్నుల వరకూ పండించినట్లు చెప్పారు. అధిక ఉత్పత్తిని సాకుగా చూపి కొనుగోలు చేయకంటే సహించబోమని కంపెనీలకు తేల్చి చెప్పారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వము, బోర్డు ముందుకు వచ్చిందని, కంపెనీలు కూడా తమ వంతు బాధ్యత నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. పొగాకు కొనుగోలు కోసం ఇప్పుడు ముందుకు వచ్చే కంపెనీలకే వచ్చే ఏడాది కూడా వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. వచ్చే ఏడాది కేవలం 80 మిలియన్ టన్నుల ఉత్పత్తి వరకే అనుమతి ఉంటుందని, అంతకు మించి పండించవద్దని రైతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు అధిక డిమాండ్ కారణంగా తాము కొనుగోలు చేస్తామంటూ వచ్చే కంపెనీలను అనుమతించబోమని కలెక్టర్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కంపెనీలు ఉదారంగా ముందుకు వచ్చి పొగాకు కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. కంపెనీల తరఫున ప్రతినిధులుగా పాల్గొంటున్న వారు ఈ విషయాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని కలెక్టర్ చెప్పారు. అలాకాకుండా దురుద్దేశపూర్వకంగా కొనుగోలును తిరస్కరిస్తే కంపెనీలను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. సోమవారం నుంచి వేలం కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ తరపున అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారిని పెడతామన్నారు. వేలం కేంద్రానికి వచ్చిన ప్రతి పొగాకు బేలును తిరస్కరించకుండా కొనుగోలు చేయాల్సిందేనని కలెక్టర్ తేల్చి చెప్పారు. ఇష్టానుసారంగా ధరల కోత, నో బిడ్ అంటే కుదరదని స్పష్టం చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఈ విషయాలన్నిటినీ పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు కూడా ఒకరకమే కాకుండా వివిధ గ్రేడ్ల పొగాకులను పూర్తిస్థాయిలో వేలం కేంద్రానికి తీసుకురావాలని ఆయన చెప్పారు. మొత్తంగా చూస్తే సగటున కిలోకు రూ.200 తగ్గకుండా చూడాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలను వేలం కేంద్రాలలో అమలయ్యేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
What's Your Reaction?