కోవూరులో గిరిజనుల సమస్యలను పరిష్కరించండి

Nov 13, 2024 - 12:27
 0  136
కోవూరులో  గిరిజనుల సమస్యలను పరిష్కరించండి

కోవూరులో గిరిజనుల సమస్యలను పరిష్కరించండి

-అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

- సమాధానమిచ్చిన మంత్రి

- సమస్యలను పరిష్కరిస్తామని హామీ

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో యానాదులు, చల్ల యానాదులు అధిక సంఖ్యలో ఉంటారని, వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోవూరు ఎమ్మెల్యే  వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి  కోరారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా బుధవారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు.కోవూరు నియోజకవర్గం మొత్తంలో 100కు పైగా గిరిజన కాలనీలు ఉన్నాయని, వీరందరూ కూడా అప్పటి ముఖ్యమంత్రి, దివంగత ఎన్‌టీ రామారావు  కట్టించిన ఇళ్లలోనే నివసిస్తున్నారన్నారు. వీటిల్లో దాదాపు 6 వేల ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, వీరికి నూతన ఇళ్ళను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో ఒక ఏకలవ్య మోడల్ స్కూల్ మాత్రమే ఉందని, గిరిజనుల విద్యా ప్రమాణాలను పెంపోదించడానికి మండలానికి ఒకటి చొప్పున ఏకలవ్య మోడల్ స్కూల్‌ ని ప్రతిపాదించాల్సినదిగా కోరారు.  అలాగే గిరిజనులకు ఆధార్ కార్డుల జారీలో సమస్య ఉండడం వలన ప్రభుత్వ పథకాలు వారికి చేరడం లేదని, దీనికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా సభాముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి  ప్రశ్నలకు రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానమిచ్చారు. ఏకలవ్య పాఠశాలలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, ప్రస్తుతం మన ప్రభుత్వం హయాంలో వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. గిరిజనుల అభివృద్ధికి బడ్జెట్‌లో 7,500 కోట్లు కేటాయింపులు చేశామని, తప్పకుండా గిరిజనుల సమగ్రాభివృద్ధికి పాటుపడతామన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow