ఆపరేషన్ గ్రీన్స్ క్రింద నెల్లూరుకు కేటాయించిన ప్రాజెక్టులు పరిస్థితి ఏంటి?

ఆపరేషన్ గ్రీన్స్ కింద నెల్లూరుకు కేటాయించిన ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి?
ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన (PMKSY) పథకం కింద దీర్ఘకాలిక లక్ష్యంతో ఆపరేషన్ గ్రీన్స్‌లో భాగంగా సముద్ర రంగంలో రొయ్యలకు సంబంధించి రూ. 158 కోట్ల అంచనా వ్యయంతో 2 ప్రాజెక్టులను నవంబర్ 2022లో నెల్లూరు జిల్లాలో కేంద్రం ఆమోదించిందని, ఆ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి ఏంటని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు లోక్‌సభలో ఆయన పలు అంశాలపై ఆరా తీశారు. ఆమోదించబడిన ప్రాజెక్టుల్లో ఒకటి పూర్తయిందనేది వాస్తవమేనా, అలా అయితే రెండవ ప్రాజెక్టు స్థితిగతులేంటని, ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియజేయాలన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆపరేషన్ గ్రీన్స్ స్కీమ్ - ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన (PMKSY) కింద దీర్ఘకాలిక లక్ష్యాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు సముద్ర రంగంలో రొయ్యలకు సంబంధించిన రెండు ప్రాజెక్టులను మంత్రిత్వ శాఖ ఆమోదించిందని చెప్పారు. ఇందులో ఆల్ఫా మెరైన్ లిమిటెడ్ అనే ఒక ప్రాజెక్ట్ పూర్తయిందని, మరొక ప్రాజెక్ట్ ఫాల్కన్ మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ 12.12.2024న రద్దు చేయబడిందన్నారు. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ (PIA) మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆమోద పత్రం ప్రకారం ప్రాజెక్టును అమలు చేయడంలో విఫలమైన కారణంగా ప్రాజెక్టు రద్దయిందని వివరించారు.
What's Your Reaction?






