రామాయపట్నం ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు భూములు పరిశీలన

Feb 7, 2025 - 19:49
Feb 7, 2025 - 19:50
 0  427
రామాయపట్నం  ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు భూములు పరిశీలన

రామాయపట్నం ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు భూములు పరిశీలన

రామాయపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమల స్థాపనకు భూములు పరిశీలించిన రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య శాఖల కార్యదర్శి ఎన్. యువరాజ్ శుక్రవారం జిల్లాలోని రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లోని భూములను జిల్లా కలెక్టర్ ఒ ఆనంద్ తో కలసి పరిశీలించారు. తొలుత జిల్లా పర్యటనకు విచ్చేసిన పరిశ్రమల వాణిజ్య శాఖల కార్యదర్శి ఎన్. యువరాజ్ కు జిల్లా కలెక్టర్ మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం అలగాయపాలెం వ్యవసాయ భూములను పరిశీలించారు. కరేడు చెరువును పరిశీలించి ఆయకట్టు వివరాలను తెలుసుకున్నారు. చెరువులో నీరు సమృద్ధిగా ఉండటం చూసి వర్షాధారమా లేక ప్రాజెక్ట్ ద్వారా నీరు నింపారా అని విచారించారు. అనంతరం టెంకాయచెట్లపాలెం గ్రామ పరిధిలోని భూములను పరిశీలించారు. మ్యాపుల సహాయంతో ప్రభుత్వ, పట్టా భూముల వివరాలను జిల్లా కలెక్టర్ వివరించారు. అనంతరం కావలి రూరల్ అనెమడుగు గ్రామ పంచాయతీ లోని సర్వాయపాలెం, అనెమడుగు గ్రామాల భూములను పరిశీలించారు. ఇప్పటికే వివిధ పరిశ్రమలకు కేటాయించిన భూమి వివరాలను ఆరా తీశారు. అనంతరం చెన్నాయపాలెం భూములను పరిశీలించి నేరుగా రామాయపట్నం పోర్టు కు చేరుకున్నారు. పోర్టు పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇండోసోల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించారు. ప్లాంట్ లో కలియతిరిగి పనుల పురోగతి గురించి కంపెనీ ప్రతినిధులను విచారించారు. ఈ కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు సి ఇ ఒ ప్రవీణ్ ఆదిత్య, కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ, కావలి ఆర్డిఓ వంశీకృష్ణ, రామాయపట్నం రాజశేఖర్, తహసీల్దార్లు, ఇతర అధికారులు ఉన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow