మత్స్యకారుల సమస్యలపై ఎంపీ వేమిరెడ్డి దృష్టి

Dec 10, 2024 - 16:10
 0  149
మత్స్యకారుల సమస్యలపై ఎంపీ వేమిరెడ్డి దృష్టి

మత్య్సకారుల సమస్యలపై ఎంపీ వేమిరెడ్డి దృష్టి

జిల్లాలో మత్య్సకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర పంచాయితీరాజ్ శాఖ, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తో భేటీ అయి జిల్లాలో మత్య్సకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. మంగళవారం కేంద్రమంత్రికి ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ వేమిరెడ్డి.. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద, మత్స్యకార సమాజం యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు లోతైన సముద్రపు చేపల వేట నౌకల కొనుగోలుకు మద్దతు కోసం పథకం ప్రవేశపెట్టబడిందన్నారు. అయితే నెల్లూరు జిల్లాల సాప్రదాయ మత్స్యకారులకు గణనీయమైన ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో పథకం కింద ప్రస్తుతం ఉన్న నిబంధనలు సవాలుగా మారాయన్నారు. ప్రత్యేకంగా యూనిట్ ధర మరియు సబ్సిడీ, మెరుగైన ఉత్పాదకత మరియు ఆదాయం కోసం తమ నౌకలను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం, డీప్ సీ ఫిషింగ్ నౌకల యూనిట్ ధర రూ.120.00 లక్షలు, ఎస్సీ & ఎస్టీలకు సబ్సిడీ రూ.72.00 లక్షలు (60%), OC & BCలకు సబ్సిడీ రూ.48.00 లక్షలు (40%) గా ఉందన్నారు. అయితే సాంప్రదాయ మత్స్యకారులు ఇంత ఆర్థిక భారాన్ని మోసే స్థితిలో లేరని చెప్పారు. అలాగే బోగోలు మండలం జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్‌ను ప్రారంభించిన నేపథ్యంలో పెద్ద ఓడలకు బదులుగా సులభమైన నిర్వహణ, తక్కువ ఖర్చుతో కూడిన మధ్య తరహా బోట్లను అందించాలని కోరారు. అలాగే మత్స్యకారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రస్తుతం ఇస్తున్న 40% సబ్సిడీ సరిపోదని వివరించారు. గతంలో బ్లూ రివల్యూషన్ లేదా ఫిషరీస్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ (FDS) కింద సబ్సిడీ 60% నుండి 75% వరకు ఉండేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సబ్సిడీ భాగాన్ని 40% నుండి 60% వరకు పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అలాగే డీప్‌సీ బోట్ల యూనిట్ ధరను రూ.120.00 లక్షల నుండి రూ.60.00 లక్షలకు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. -

పొన్నపూడి పాతూరు గ్రామంలో ఫిషింగ్ జెట్టీ మంజూరుకు ప్రతిపాదన.

అలాగే విడవలూరు మండలం పొన్నపూడి పాతూరు గ్రామం వద్ద ఫిషింగ్ జెట్టీ ఏర్పాటు చేయాలని ఎంపీ వేమిరెడ్డి గారు కేంద్రమంత్రిని కోరారు. చేపల వేటకు వెళ్లే మత్య్సకారులు.. సముద్రంలోకి వెళ్లేందుకు ఉపయోగపడే పైడేరు వాగు సముద్ర ముఖద్వారం వద్ద పూడిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దీంతో విడవలూరు మండలం రామచంద్రాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల ప్రజల జీవనోపాధి లేక అవస్థలు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో పొన్నపూడి పాతూరు గ్రామం వద్ద మత్స్యకార జెట్టీని నిర్మించి మండలంలో నడుస్తున్న 370 బోట్లకు బెర్తింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉందన్నారు. ఈ జెట్టీ ఏర్పడితే.. తుఫానుల సమయంలో పడవలను రక్షించడమే కాకుండా చేపల ల్యాండింగ్‌లను అన్‌లోడ్ చేయడానికి సురక్షితమైన ప్రాంతంగా మారుతుందన్నారు. అలాగే ప్రాజెక్ట్ పైడేరు వెంట ఉన్న 12 గ్రామాల్లో నివసిస్తున్న 1750 కుటుంబాలకు చెందిన సుమారు 6000 మంది మత్స్యకారులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. జెట్టీ ఏర్పాటుకు సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

పైడేరుకు ఇరువైపులా డ్రెడ్జింగ్ మరియు రివిట్‌మెంట్ పనులు చేపట్టండి..

పైడేరు వాగు పొన్నపూడి పాతూరు గ్రామ సమీపం నుంచి 2 కిలోమీటర్ల మేర ప్రయాణించి సముద్రంలో కలుస్తుందని, ఈ కలిసే ప్రాంతం శాశ్వతంగా పూడిపోవడంతో స్థానిక మత్స్యకారులు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. దాంతో మత్స్యకారులు ప్రస్తుతం ఇస్కపల్లి మీదుగా సముద్రంలోకి ప్రవేశించడానికి 6 కి.మీ.ల అదనపు దూరం ప్రయాణించవలసి వస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో సముద్ర ముఖద్వారాన్ని శాశ్వతంగా తెరిచేందుకు పైడేరు కు ఇరువైపులా డ్రెడ్జింగ్‌, రివిట్‌మెంట్‌ పనులు అవసరమని వివరించారు. డ్రెడ్జింగ్, రివిట్‌మెంట్ పనులు పూర్తయితే మత్స్యకారుల విలువైన ప్రయాణ సమయం ఆదా అవడంతో పాటు జీవనోపాది మెరుగుపడుతుందని చెప్పారు. 

ఈ నేపథ్యంలో తన ప్రతిపాదనలను పరిశీలించి సంబంధిత అధికారులకు ముందస్తు అధ్యయనాన్ని నిర్వహించేలా ఆదేశించాలని మంత్రిని కోరారు. ఎంపీ వేమిరెడ్డి ప్రతిపాదనపై స్పందించిన కేంద్రమంత్రి... తప్పకుండా పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక మత్స్యకారుల జీవనోపాదికి తప్పకుండా ప్రాధాన్యమిచ్చేలా కృషి చేస్తామని వివరించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow