మతం అడిగి మరీ కాల్చి చంపారు

Apr 24, 2025 - 20:27
Apr 24, 2025 - 20:29
 0  246
మతం అడిగి మరీ కాల్చి చంపారు

మతం అడిగి మరీ కాల్చి చంపారు

• పేలుడు చప్పుళ్లకు పారిపోతుంటే శాలువాలు అమ్మేవారు తప్పుదోవ పట్టించారు

• పడుకుంటే కాల్చరని చెప్పారు.. నా కళ్లెదుటే నా భర్తను కాల్చేశారు

• చిన్న చిన్న పిల్లలు ఉన్నవారినీ వదల్లేదు

• ఉగ్రవాదులు అత్యంత నిర్ధయగా ప్రవర్తించారు

• కశ్మీర్ సురక్షితంగా ఉంటుందని నమ్మి వెళ్లాం

• ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  ఎదుట కన్నీటి పర్యంతమైన ఉగ్రదాడిలో హతమైన మధుసూదన రావు  సతీమణి శ్రీమతి కామాక్షి 

• మీ బాధని ఎవరూ తీర్చలేరంటూ పవన్ కళ్యాణ్  ఓదార్పు

కశ్మీర్ సురక్షితంగా ఉంటుందనే నమ్మకంతో విహార యాత్రకు వెళ్లాము. ఇలాంటి దారుణం జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఉగ్రవాదులు నా కళ్ల ఎదుటే నా భర్తను చంపేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన  మధుసూదన రావు  భార్య  కామాక్షి . గురువారం మధ్యాహ్నం ఉగ్రదాడిలో అమరులు అయిన కావలికి చెందిన  మధుసూదన రావు  పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పహల్గాం దాడి సందర్భంగా ఎదురైన భయానక పరిస్థితులను  కామాక్షి–  పవన్ కళ్యాణ్ కి వివరించారు.ఉగ్రవాదులు చాలా క్యాజువల్ గా వచ్చి నరమేధం సృష్టించి వెళ్లారు.కోవిడ్ సమయంలో అత్త, మామ కోసమని అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వదులుకుని బెంగళూరు వచ్చాము. బెంగళూరు నుంచి మూడు కుటుంబాలు పహల్గాం విహార యాత్రకు వెళ్లాం. ఆ కొండల అందాలు చూసి సంతోషించాం. మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే ప్రాంతానికి గుర్రాలపై వెళ్లాం. అక్కడ భోజనం చేసి బయటకు వచ్చిన కొద్దిసేపటికి కాల్పుల శబ్దాలు వినిపించాయి. అక్కడ ఉన్నవారితో పాటు మేము భయంతో పరుగులు తీస్తుండగా శాలువాలు అమ్మే వారి ముసుగులో ఉన్న కొందరు మమ్మల్ని ఏమార్చారు. కశ్మీర్ వార్షికోత్సవ వేడుకల శబ్దాలు అని చెప్పారు. కాల్పుల శబ్దాలు చేరువైన సమయంలో పరుగుపెడుతుంటే పడుకుంటే కాల్చరని చెప్పి తప్పుదోవ పట్టించారు. చేతులు పట్టుకుని పిల్లలను, నిన్ను దేవుడు కాపాడుతాడు ఏమీ కాదు అని నా భర్త చెయ్యి కదుపుతూ చెబుతున్నారు. తల పైకి ఎత్తవద్దని చెప్పారు. ఇద్దరం నేలపై చేతులు పట్టుకుని పడుకుని ఉండగా ఎవరో నడుచుకుంటూ వచ్చిన శబ్దం వినిపించింది. హిందూనా.. ముస్లిమా అని అడిగారు. మేము స్పందించలేదు. వెంటనే షాట్ సౌండ్ వినిపించింది. నా భర్త రక్తంతో నా దుస్తులు మొత్తం తడిచిపోయాయి. నా భర్తని కాల్చిన తర్వాత ఎవరైనా రక్షిస్తారని బయటకు పరుగులు తీశాను. ఎవరూ కనిపించలేదు. తర్వాత కొంత మంది ఆర్మీ క్యాంపు వద్దకు తీసుకువెళ్లినట్టు తెలిపారు. ఉగ్రవాదులు అత్యత క్రూరంగా ప్రవర్తించారు. చిన్నపిల్లలు ఉన్నారని కాళ్లు పట్టుకున్న వారినీ వదల్లేదు. తల్లి ఎదుటే కొడుకుని, భర్త ఎదుట భార్యని హతమార్చారు. ఉగ్రవాదులు చాలా క్యాజువల్ గా నడుచుకుంటూ వచ్చి మారణహోమం సృష్టించి అంతే క్యాజువల్ గా వెళ్ళిపోయారు.నా కొడుకు మా నాన్నని కాపాడమని నాలుగు గంటల పాటు మా ఇంటి దైవం  నరసింహస్వామిని వేడుకుంటూనే ఉన్నాడు. ఏ దేవుడు కూడా మాకు తోడు రాలేదు. భార్య, భర్తలిద్దరం సాఫ్ట్ వేర్ ఉద్యోగులం అని ఇప్పటి వరకు తమ కుటుంబానికి ఒకరి వద్ద చేయి చాచే పరిస్థితి రాలేదని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.• ఇక మీదట కూడా ఎవరి వద్ద చేయి చాచే పరిస్థితి రాదు : పవన్ కళ్యాణ్  మధుసూదనరావు భార్య, కుమార్తె మేధ, కుమారుడితో పాటు తల్లిదండ్రులను పరామర్శించారు. ఉగ్రదాడి వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం  మధుసూదన్ కుటుంబానికి తాను అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన బతికి ఉండగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో? అలానే ఎవరి వద్దా చేయి చాచే పరిస్థితులు రాకుండా చూసుకుంటామ"ని హామీ ఇచ్చారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow