ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడే ముఠా ఆట కట్టించినట్లు నెల్లూరు -జిల్లా యస్.పి. జి.కృష్ణకాంత్ తెలిపారు. శనివారం ఎస్పి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచంలో ఎవరికైనా ఏమీ ఊరికినే రావు.. ఎవరూ ఊరికే ఇవ్వరు అనే విషయం గ్రహించి, అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో అదనపు ఆదాయం ఆర్జించమంటూ ఆశ చూపి, ఆన్ లైన్ లో నగదు పెడితే 10 నుండి 15% ఆదాయం సంపాదించవచ్చని, ట్రేడింగ్ చేసే వారినే లక్ష్యంగా చేసుకొని కొత్త పంథాలో సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. తక్కువ సమయంలో సులువుగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశను సైబర్ నేరగాళ్లు అస్త్రంగా ఎంచుకుంటున్నారన్నారు. సైబర్ నేరగాళ్లు రూపొందించిన వెబ్ సైట్ లలో కొంత అమౌంట్ పెట్టక లాభాలు వస్తున్నట్లు ఎర వేసి, అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టించి, ఆ నగదు అకౌంట్ లో కనబడతాయి కానీ మీ ఖాతాలో జమ కామన్నారు.అమాయక ప్రజలే లక్ష్యంగా వల వేస్తున్న ముద్దాయిలు.. దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు.. తస్మాత్ జాగ్రత్త. జల్సాలకు అలవాటుపడి నగదు కోసం ముఠాగా ఏర్పడి సైబర్ నేరానికి పాల్పడుతున్న ముద్దాయిలందరూ యువతే అని తెలిపారు. నెల్లూరు నగరంలోని మహిళ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా..... తీగ లాగితే డొంక కదిలినట్లు చిన్నబజార్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూపి లాగి జల్లెడ పట్టి ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నకిలీ ఆధార్ మరియు పాన్ కార్డులను సృష్టించి, బ్యాంక్ అకౌంట్ లను ఓపెన్ చేసి, సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు..బయోమెట్రిక్ ధృవీకరణ అవసరం లేని రోడ్‌సైడ్ సేల్ పాయింట్ల నుండి D-KYC ద్వారా సిమ్ కార్డులను పొందుతారు. తద్వారా అకౌంట్ కు సిమ్ కార్డును లింక్ చేస్తారు. 7 మంది ముద్దాయిలు అరెస్ట్.. సుమారు 2.46 కోట్లు బాధితుల నగదు కాజేసినట్లు ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు. నిందితుల పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి 39.40 లక్షల నగదు హోల్డ్ చెయ్యమని బ్యాంక్ లకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో ఫ్రాడ్ జరిగినట్టు అయితే వెంటనే నిర్బయంగా వచ్చి పోలీసు వారిని ఆశ్రయించాలని, ఆందోళన చెంద కుండా సకాలంలో స్పందిస్తే పూర్తి న్యాయం జరుగుతుంది. మోసం జరిగిన వెంటనే http://cybercrime.gov.in/ కు లేదా 1930 లేదా దగ్గరలోని పోలీస్ వారికి పిర్యాదు చేయాలని తెలిపారు. చాకచక్యంగా ముద్దాయిలను అరెస్ట్ చేసిన చిన్నబజార్ ,సైబర్ పోలీసు సిబ్బంది, అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.