అసమానతలు లేని సమాజ స్థాపన అంబేద్కర్ లక్ష్యం

అసమానతలు లేని సమాజ స్థాపనే అంబేద్కర్ లక్ష్యం
- ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
సమాజంలో అట్టడుగు వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిదేనన్నారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన బుచ్చిరెడ్డి పాళెం మండలం దామరమడుగు గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శివాలయాన్ని సందర్శించిన వేమిరెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్థానిక అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఆనందంగా వుందన్నారు. అంబేద్కర్ గొప్పతనాన్ని భావి తరాలకు తెలిపేలా ఆయన జ్ఞాపకార్థం అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట చేసిన జగదీష్ మిత్రబృదాన్ని అభినందించారు. అంబేద్కర్ ఆశించిన కుల రహిత సమాజం కోసం పాటు పడాలని ఆకాంక్షించారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా స్థానిక యువతకు ఉపాధి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ లో 2 లక్షల కోట్లతో సెమి కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో పాటు మరో 2,000 వేల కోట్లతో లిథియం ఐకాన్ బ్యాటరీ, ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు రానున్నాయన్నారు. ఉలవపాడు మండలం రామాయపట్నం వద్ద 95 లక్షల కోట్ల వ్యయంతో బీపీసీఎల్ రిఫైనరీ రానుందని ఈ భారీ పరిశ్రమల రాకతో జిల్లాలో దాదాపు 40 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ కుల నిర్మూలన, మహిళా సాధికారత కోసం పోరాడి సాధించిన అభ్యుదయవాది అని కొనియాడారు. రాజకీయాల్లో తన లాంటి మహిళలు రాణిస్తున్నారంటే అది అంబేద్కర్ కృషి ఫలితంగానే సాధ్యమైందన్నారు. దళిత అభ్యున్నతి కోసం ఆయన పోరాటాల కారణంగానే నాడు రామనాధ్ కోవింద్, నేడు ద్రౌపది ముర్ము లాంటి సామాన్యులు రాష్ట్రపతులు కాగలిగారన్నారు. తన గెలుపుకు కృషి చేసిన దామరమడుగు వాసులను అభినందిస్తూ ఎన్నికల సందర్భంగా యిచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామన్నారు. ఇటీవల 25 లక్షల వ్యయంతో దామరమడుగు పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, బుచ్చి తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపిడిఓ శ్రీహరి స్థానిక నాయకులు టిడిపి సీనియర్ యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఏటూరి శివరామ కృష్ణారెడ్డి, టిడిపి బుచ్చి మండల రూరల్, అర్బన్ అధ్యక్షులు బత్తుల హరికృష్ణ, ఎం వి శేషయ్య, కెవి శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






