సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఉత్తమ మార్గం
సంపూర్ణ ఆరోగ్యానికి అనుదినం యోగా సాధన ఉత్తమ మార్గమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్.పి.రాజాబాబు, ఎస్పీ .వి.హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి.నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో పాల్గొన్న కార్యక్రమానికి సమాంతరంగా ఉదయం ఆరు గంటల నుంచి 6:45 గంటల వరకు జరిగిన యోగా సాధన కార్యక్రమంలో వీరు ఉత్సాహంగా ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో 2000 మంది వరకు మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హ్యాపీ, హెల్తీ సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా యోగాంధ్ర కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ యోగా సాధనను తమ జీవితంలో భాగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగా సాధనపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా మూడు లక్షల అరవై మూడు వేల మందికిపైగా ప్రజలు దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అంతకుమించి యోగాసనాల కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నట్లు కలెక్టర్ చెప్పారు. గత 15 రోజులుగా జిల్లావ్యాప్తంగా 4428 వేదికలలో యోగాభ్యసన కార్యక్రమాలను నిర్వహించామన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రజలు ఇందులో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ యోగాసనాలను కొనసాగించడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్నారు. ఎస్పీ మాట్లాడుతూ యోగాను జీవన విధానంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం పొంది సానుకూల దృక్పథంతో జీవించవచ్చు అన్నారు.నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన శైలికి యోగా సాధన ఎంతో ముఖ్యమన్నారు. చిన్ననాటి నుంచే ప్రతి ఒక్కరూ యోగా సాధన అలవాటు చేసుకోవాలని సూచించారు. గత రెండు వారాలుగా యోగాసనాలలో శిక్షణ ఇచ్చిన గురువులను ఈ కార్యక్రమంలో సత్కరించారు. కాగా, ఈనెల 26వ తేదీన అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ' నషా ముక్త్ భారత్ ' ఇతివృత్తంతో రూపొందించిన పోస్టర్లను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. మాదకద్రవ్యాలను స్వీకరించబోమని ప్రజలతో ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు.ఈ యోగాసనాల కార్యక్రమంలో డిఆర్ఓ మాధురి, జిల్లా పర్యాటక అధికారి తేళ్ల రవికుమార్, యోగాంధ్ర నోడల్ ఆఫీసర్ భీమ్ నాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
What's Your Reaction?