నాతో కలిసి రండి రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా మారుద్దాం. - సీఎంచంద్రబాబు

Feb 15, 2025 - 18:55
Feb 15, 2025 - 19:01
 0  302
నాతో కలిసి రండి రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా మారుద్దాం. - సీఎంచంద్రబాబు

-స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -

సభకు హాజరైన జనం 

-నాతో కలిసి రండి రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా మారుద్దాం.

- పరిసరాల పరిశుభ్రత కోసం నెలలో ఒకరోజు కేటాయించాలని ప్రజలకు సీఎం పిలుపు..

- ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదు ..

 -అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో చెత్తంతా క్లియర్... 

- కందుకూరులో స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు

కందుకూరు ఫిబ్రవరి 15 : ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించామని, పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు శనివారం పర్యటించారు. కందుకూరు మున్సిపాలిటీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దూబగుంట వద్ద మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం, గ్రామస్థులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత కందుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో స్టాళ్లను పరిశీలించిన సీఎం, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వేస్ట్ టు వెల్త్ అనేది తన నినాదమని అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ప్రస్తుతం క్రిమిసంహారక మందులు వాడిన ఆహారం తింటూ రోగాల బారిన పడుతున్నారని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రజలతో సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు.

నెలలో ఒక్కరోజు కేటాయించండి….

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు. పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించామన్న సీఎం, పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలని కోరారు. ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదని స్పష్టం చేశారు. నేరస్తుల పట్ల కఠినంగా ఉంటామని, ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హెచ్చరించారు. గంజాయి ఉత్పత్తి చేస్తే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, అక్టోబర్ 2 నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్‌శాఖకు అప్పగించామని గుర్తు చేశారు. చెత్తను పునర్వినియోగం చేసేందుకు కృషి చేస్తున్నామన్న చంద్రబాబు, చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంపునకు యత్నిస్తున్నామని చెప్పారు.ప్రతినెల పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 64 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నామన్న సీఎం, ఏడాదికి రూ.33 వేల కోట్లు పింఛన్ల రూపంలో ఇస్తున్నామని వెల్లడించారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ప్రజల్లో ఉత్సాహం చూస్తే తనకు ఎక్కడ లేని ధైర్యం వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రజలకు సేవలు అందించడమే తన లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు చేసిందని, వాటికి అసలు, వడ్డీలు కట్టాలని తెలిపారు. అప్పులు చెల్లించాలని కొందరు ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారన్న చంద్రబాబు, తమ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టించామని చెప్పారు. సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలనే సంకల్పం ఉన్నా ఖజానా ఖాళీగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చేందుకు మట్టి కూడా వేయలేదని చంద్రబాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వం రాగానే రోడ్ల మరమ్మతులకు రూ.1600 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయం సేకరిస్తున్నామని, వినూత్నమైన ఆలోచనలతో ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు. అంతకుముందు కందుకూరు చేరుకున్న సీఎంకు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్వాగతం పలికారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow