శ్రీ శైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు స్వర్ణ రథం అందించిన వేమిరెడ్డి దంపతులు

శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివార్లకు స్వర్ణ రథం అందించిన శ్రీ వేమిరెడ్డి దంపతులు
-రథసప్తమి సందర్భంగా అందజేత.. అనంతరం స్వామివారి ఊరేగింపు
-స్వర్ణ రథం అందజేతపై హర్షించిన భక్తజనం
జనసాక్షి :రాజ్యసభ సభ్యులు, సేవా భూషణులు, దాత శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు, టిటిడి ఢిల్లీ స్థానిక సలహా మండలి ఛైర్‌పర్సన్ శ్రీమతి ప్రశాంతి రెడ్డి దంపతులు తమ దాతృత్వాన్ని మరోసారి ఘనంగా చాటారు. శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారికి శుక్రవారం రథసప్తమి సందర్భంగా స్వర్ణ రథం కానుకగా అందించారు. స్వామివారి మహాకుంభాభిషేకం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిగారి సమక్షంలో స్వర్ణ రథ ప్రారంభోత్సవం వైభవంగా నిర్వహించారు. దీంతో శ్రీశైల మల్లన్నకు తొలిసారిగా స్వర్ణం రథం సమకూరినట్లైంది. ఈ సందర్భంగా శ్రీ వేమిరెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వర్ణ రథం ప్రారంభోత్సవం అనంతరం శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జునస్వామివారిని రథంపై ఉంచి పుర వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, వేద పండితులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
-స్వర్ణ రథం విశేషాలు....
23.6 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ స్వర్ణ రథానికి మధ్యలో బంగారు తాపడంతో చేసిన పార్వతీపరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి మూర్తులను అత్యంత సుందరంగా కొలువుదీర్చారు. స్వామి, అమ్మవార్ల చుట్టూ అష్ట దిక్పాలకులను తీర్చిదిద్దారు. ముందు భాగంలో స్వారీ చేస్తున్నట్లు ఉండే రెండు పెద్ద అశ్వాలను రూపొందించారు. శివపార్వతుల విగ్రహాలకు ముందు భాగంలో కింద బ్రహ్మ విగ్రహాన్ని రూపొందించారు. దాంతోపాటు స్వర్ణరథంపై ఎనిమిది నందులు, దక్షిణామూర్తి, దుర్గ, వినాయకుడు, లింగోద్భవ శివయ్య రూపాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
What's Your Reaction?






