భాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్లే

భాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్లే
మన భాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్లేనని భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. మన భాషను మనం కాకపోతే ఇంకెవరు మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశాల 2వ రోజు ఉదయం ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా సభా ప్రాంగణానికి చేరుకున్న వెంకయ్య నాయుడుకి సమాఖ్య అధ్యక్ష ఉపాధ్యక్షులు ఇందిరా దత్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ప్రత్యేకంగా ఆకర్షించాయి. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ స్వాగతోపన్యాసం అందించారు.ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వై వార్షిక అంతర్జాతీయ మహాసభలకు విచ్చేసి అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భాషను కాపాడుకునేందుకు సమాఖ్య చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అందుకు ప్రతిఒక్కరినీ పేరుపేరునా అభినందిస్తున్నామని చెప్పారు. భాషా సంస్కృతిని భవిష్యత్తు తరాలకు ఒక సంపదగా అందించాలని ఆయన కోరారు. మన భాషను మనం కాపాడుకోకుంటే ఇంకెవరు కాపాడుతారని, మన భాషను మనం మాట్లాడకుంటే ఇంకెవరు మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. తెలుగును ప్రాధమిక విద్యలో తప్పనిసరి చేయాల్సిన ఆవస్యకతను ఆయన వివరించారు. దేశంలో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించిన వారు.. మన తెలుగులో ప్రాథమిక విద్యను అభ్యసించినవారేనని ఆయన స్పష్టం చేశారు. పరిపాలనా భాషగా మాతృభాషను ఉపయోగిస్తేనే ప్రజలకు చేరుతుందన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. మానసిక చైతన్యానికి, విజ్ఞాన వినోదాలకు, ఆనందోత్సాహాలకు మాతృభాష కీలకమని, మన మాతృబాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రస్తావించారు. తెలుగు భాషకు ఉన్న చరిత్ర చాలా గొప్పదని వివరించారు. వచ్చీ రానీ ఇంగ్లీష్‌లో మాట్లాడేకంటే.. స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడటం ఉత్తమమని పేర్కొన్నారు. ఇంగ్లీషు వ్యామోహంతో మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు, అభివృద్ధి ఉందని ఆయన స్పష్టం చేశారు. మాతృభాష అంటే మాట్లాడుకునే నాలుగు మాటలే కాదని, మన సంస్కృతి అని ఉద్ఘాటించారు. అన్ని రంగాల్లోనూ తెలుగు వినియోగం పెరగాలన్నారు. నమస్కారమే మన సంస్కారం అని, మన మధురమైన భాషలోనే మన జీవనం సాగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పలువురు కళాకారులను ఆయన సత్కరించి జ్ఞాపికను అందించారు.
What's Your Reaction?






