బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకోండి
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం మునిపిపాలిటీ గుండా వెళ్లే జాతీయ రహదారి -67పై( చుంచీలూరు నుంచి నెల్లూరు వరకు) లోడ్ బేరింగ్ పేవర్ బ్లాక్‌ల నిర్మాణం చేపట్టాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఛైర్మన్ సంతోష్‌కుమార్ యాదవ్‌ను ఢిల్లీలోని ఆయన ఛాంబర్‌లో కలుసుకుని ఇందుకు సంబంధించి వినతి అందజేశారు.బుచ్చిరెడ్డిపాలెం మునిసిపాలిటీ పరిధిలో NH-67 (చుంచీలూరు నుండి నెల్లూరు వరకు) సెక్షన్‌లో కి.మీ. 722.33 నుంచి కి.మీ 724.800 వరకు లోడ్ బేరింగ్ పేవర్ బ్లాక్‌ల నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం బుచ్చిరెడ్డిపాలెం పట్టణ పరిధిలో ట్రాఫిక్ రద్దీ తీవ్రమైన సమస్యగా మారిందని, దీని కారణంగా తాత్కాలిక షెడ్‌లు మరియు నెట్టడం బండ్ల రూపంలో రోడ్డుపై ఆక్రమణలు పెరుగుతున్నాయన్నారు. వాహనాలను సక్రమంగా పార్కింగ్ చేయకపోవడం, పాదచారులకు సురక్షితమైన, ప్రత్యేక ఫుట్‌పాత్ లేకపోవడం సమస్యగా మారిందని వివరించారు. దాంతో ప్రజలకు అసౌకర్యంగా ఉండటంతో పాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇటీవల రహదారి విస్తరణలో భాగంగా రహదారిపై ఉన్న ఆక్రమణలను తొలగించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి-67పై లోడ్ బేరింగ్ పేవర్ బ్లాక్‌ల నిర్మాణ పనులను చేపట్టాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సంతోష్ కుమార్.. తప్పకుండా వినతులను పరిశీలించి బుచ్చిలో ట్రాఫిక్ నియంత్రణకు లోడ్ బేరింగ్ పేవర్ బ్లాక్స్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
What's Your Reaction?