మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
రూ.5,000 జరిమానా విధించిన ఒంగోలు పోక్సో కోర్టు
కేసు విచారణలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు,
ప్రకాశం జిల్లా, అక్టోబర్ 30: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో (POCSO) కోర్టు న్యాయమూర్తి కె. శైలజ శుక్రవారం తీర్పు వెలువరించారు. బాధితురాలికి పరిహారంగా రూ.2 లక్షలు అందజేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.కేసు వివరాలు:ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పాజర్ల గ్రామానికి చెందిన పొల్లూరి యేబు (25) అనే వ్యక్తి 2020 జూన్ 1వ తేదీన 12 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. దీంతో అప్పటి గుడ్లూరు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఎం. శ్రీనివాసులు (1710) కేసు నమోదు చేశారు. అప్పటి కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు.కేసు విచారణలో భాగంగా పోలీసులు సాక్షులను సకాలంలో న్యాయస్థానంలో హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మార్గదర్శకత్వంలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ టీం కేసు విచారణను నిరంతరం పర్యవేక్షించింది. సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడిపై మోపిన అభియోగాలు నిరూపితం కావడంతో న్యాయస్థానం 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ.2 లక్షల పరిహారాన్ని ఒంగోలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) ద్వారా అందజేయాలని ఆదేశించింది.ఈ కేసులో సమర్థవంతంగా విధులు నిర్వహించి, నేర నిరూపణకు కృషి చేసిన అప్పటి కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసులు, పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు, కోర్టు లైజన్ సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు అభినందించారు.మైనర్ బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా, బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
What's Your Reaction?