కార్తీక మాస లక్ష దీపోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ప్రశాంతిరెడ్డి
ఈ నెల 8వ తేదీ నుంచి నెల్లూరులోని వి.ఆర్.సి మైదానంలో నిర్వహించనున్న కార్తీక మాస లక్ష దీపోత్సవ ఏర్పాట్లను కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరిశీలించారు. గురువారం వి.ఆర్.సి మైదానానికి చేరుకున్న ఆమెకు కమిటీ సభ్యులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మైదానం అంతా కలియదిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు. పెండింగ్ పనులపై కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , తాము రాజకీయాల్లోకి రాకముందు నుంచి గత 8 సంవత్సరాలుగా కార్తీక మాస లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది మరింత వైభవంగా కార్తీక మాస లక్ష దీపోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నాసిక్‌లోని త్రయంబకేష్వర్ ఆలయ నమూనా, అయోధ్య రామాలయం నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు భాస్కర్ శర్మ, ప్రభాకర్‌రావు, గంధం సునీల్, విజయసారధి, అర్చకులు పవన్ శర్మ, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.