ఏపీకి త్వరలో 750 విద్యుత్ బస్సులు

త్వరలోనే ఏపీకి 750 విద్యుత్ బస్సులు -
అమరావతికి 50, విశాఖకు 100
ఆర్టీసీలో సరికొత్త విద్యుత్ బస్సులు - తొలి దశలో 750 బస్సులను రాష్ట్రానికి పంపిస్తున్న కేంద్ర ప్రభుత్వం : ఏపీఎస్ఆర్టీసీలో సరికొత్త విద్యుత్ బస్సుల రాకకు రంగం సిద్ధమవుతోంది. తొలి దశలో 750 బస్సులను రాష్ట్రానికి పంపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బస్సుల టెండర్లు పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్‌ను ఎంపిక పూర్తి చేసింది. ప్రస్తుతం బస్ బాడీలు సైతం సిద్ధం చేసిన కాంట్రాక్ట్ సంస్ధ, రాష్ట్రానికి బస్సులు పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయడమే తరువాయి రాష్ట్రంలోని నగరాల్లో విద్యుత్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి.
తొలి దశలో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు: పట్టణ ప్రాంతాల్లో పట్టణ బస్సు కార్యకలాపాల కోసం "PM E-బస్ సేవా" పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం, ఎంపిక చేసిన రాష్ట్రాలకు కొత్తగా విద్యుత్ బస్సులను పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని పలు పట్టణాలు, నగరాల్లో 10,000 ఎలక్ట్రిక్ బస్సులను తొలి దశలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కాంట్రాక్టర్లను సైతం ఎంపిక చేసింది. పబ్లిక్, ప్రైవేటు, పార్ట్నర్షిప్ మోడల్లో (PPP) విద్యుత్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
తొలి దశలో దేశవ్యాప్తంగా 10,000 బస్సులను ప్రవేశపెట్టేందుకు 20 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. రాష్ట్రాల్లోని ఆర్టీసీలకు కాంట్రాక్టర్ల ద్వారా విద్యుత్ బస్సులను ఏర్పాటు చేసి తిప్పనుంది. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Housing and Urban Affairs), గోల్ సంయుక్తంగా పథకాన్ని పర్యవేక్షించనున్నాయి. రాష్ట్రంలోని అర్హతగల 11 నగరాల్లో "PM-eBus సేవా పథకం" కింద ఎలక్ట్రిక్ బస్సుల కోసం గతేడాది సెప్టెంబర్ 26న ప్రతిపాదనను సమర్పించగా కేంద్రం ఆమోదించింది.
రెండు విభాగాల్లో విద్యుత్ బస్సులు: ఇందులో భాగంగా ఏపీలోని 11 నగరాల్లో 1050 బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించి ఆమోద ముద్ర వేసిన కేంద్ర ప్రభుత్వం, తొలుత 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటోంది. కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్ (CESL), విద్యుత్ మంత్రిత్వ శాఖ, గోల్, ఆధ్వర్యంలో తొలి దశలో రానున్న 750 ఈ బస్సుల కోసం టెండర్లు పిలిచి అర్హత కలిగిన సంస్థల కాంట్రాక్టర్లను ఖరారు చేసింది. టెండర్లలో పుణెకు చెందిన పిన్నాకిల్ మొబిలిటీ సెల్యూషన్స్ సంస్థ L1 గా నిలిచి రాష్ట్రంలో ఈ బస్సులు తిప్పే కాంట్రాక్టు దక్కించుకుంది. నగరాల్లో 12 మీటర్లు, 9 మీటర్లు పొడవు ఉన్న రెండు విభాగాల్లో విద్యుత్తో నడిచే ఏసీ సిటీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది.
12 డిపోల పరిధిలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు: తొలిదశలో రానున్న 750 బస్సుల్లో 9 మీటర్లు పొడవు కలిగిన ఏసీ బస్సులు 129 ఉన్నాయి. వీటికి కిలోమీటర్‌కు 62 రూపాయల 17 పైసలు చొప్పున కాంట్రాక్ట్ సంస్థకు ఆర్టీసీ అద్దె చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. 12 మీటర్లు పొడవు కలిగిన ఏసీ బస్సులు 621 వస్తుండగా, కిలోమీటర్ కు 72 రూపాయల 55 పైసలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. APSRTC ఆంధ్రప్రదేశ్‌లోని 11 నగరాల్లోని 12 డిపో స్థానాల్లో డిపో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం వివరణాత్మక అంచనాలను సిద్ధం చేసింది. ఈ అంచనాలు ఏపీ రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ (SLSC) ద్వారా MoHUAకి పంపారు. బస్సులు సిద్ధమవుతోన్న దృష్ట్యా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలన్న ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 11 నగరాల్లో 12 డిపోల పరిధిలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ఆర్టీసీ ప్రారంభించింది.
విశాఖపట్నం నగరానికి 100 సిటీ బస్సులు: రాష్ట్రానికి వస్తోన్న750 బస్సులన్నీ సిటీ ఏసీ బస్సులుగా తిరగనున్నాయి. విశాఖపట్నం నగరానికి 100 సిటీ బస్సులు మంజూరయ్యాయి. సింహపురి డిపోకు 50, గాజువాక డిపోకు 50 బస్సులు కేటాయించారు. విజయవాడ నగరానికి 100 బస్సులు మంజూరు కాగా ఇవన్నీ విద్యాధరపురం డిపోకు కేటాయించారు. అక్కడే ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు నగరంలో గుంటూరు -2 డిపోకు 100 బస్సులు రానున్నాయి.
అమరావతిలో తిరిగేందుకు 50 సిటీ బస్సులు: నెల్లూరు టౌన్లో నెల్లూరు -2 డిపోకు 100 బస్సులు, కర్నూలు - 2 డిపోకు 50 బస్సులు, కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, అనంతపురం బస్ డిపోలకు 50 బస్సుల చొప్పున మంజూరయ్యాయి. రాజధాని అమరావతిలో తిరిగేందుకు వీలుగా మంగళగిరి బస్ డిపోకు 50 సిటీ బస్సులను మంజూరు చేశారు. తిరుపతిలో మంగళం బస్ డిపోకు 50 బస్సులు రానున్నాయి. బస్సులు మంజూరు చేసిన డిపోల్లోనే ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. శరవేగంగా వీటిని నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటిని పూర్తి చేయగానే బస్సులను రోడ్డెక్కించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కొత్త బస్సులు రానున్న దృష్ట్యా అవసరమైన సిబ్బంది నియామకం పైనా ఆర్టీసీ దృష్టి సారించింది. డిపోల్లో అవసరమైన వారి నియామకం ఏ ప్రాతిపదికన చేయాలనే విషయమై త్వరలో తుది నిర్ణయం తీసుకుని అమలు చేయనుంది. మూడు నెలల్లో అన్ని ఏర్పాట్లు చేసి, బస్సులను రోడ్డెక్కించాలని ఆర్టీసీ నిర్ణయించింది. దశలవారీగా కేంద్రం నుంచి మరిన్ని వాహనాలు రానుండటంతో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని డిపోలనూ సిద్ధం చేయనుంది. ఇకపై సంస్థలో డీజిల్, సీఎన్జీ వాహనాల కొనుగోలు నిలివిపేసి, అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలనే ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు దశలవారీగా అన్ని బస్సులనూ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని నిర్ణయించిన ఆర్టీసీ, ఈ మేరకు కార్యాచరణ అమలు చేస్తోంది.
మంగళగిరిలో ఉచిత విద్యుత్ బస్సు సేవలు - ప్రారంభించిన మంత్రి లోకేశ్
ఏపీ రోడ్లపై కొత్త ఎలక్ట్రిక్ బస్సులు - తగ్గనున్న ఛార్జీలు - ఏ ఏ రూట్లలో తిరుగుతాయంటే?
త్వరలోనే ఏపీకి 750 విద్యుత్ బస్సులు - అమరావతికి 50, విశాఖకు 100
What's Your Reaction?






