ఈనెల 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు - సీఎస్

ఈనెల 12న ప్రధానమంత్రి నరేంద్ర మోడి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: సిఎస్
విజయవాడ జనసాక్షి : ఈనెల 12న కేసరపల్లి ఐటి పార్కు ప్రాంగణంలో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి పర్యటనకు సంబంధించి కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ తాత్కాలిక టూర్ ప్రోగ్రాం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఈనెల 12 ఉదయం 8.20 గం.లకు ఢిల్లీ నుండి విమానంలో బయలుదేరి ఉ.10.40.గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారన్నారు.ఉ.10.55 గం.లకు అక్కడ సమీపంలోని ఐటి పార్కు ప్రాంగణానికి చేరుకుని ఉ.11గం.ల నుండి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోడి మధ్యాహ్నం 12.40 గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని 12.45 గం.లకు విమానంలో భువనేశ్వర్ వెళతారని చెప్పారు.కావున ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.ఇందుకు సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేయాలని స్పష్టం చేశారు.
ఇంకా ఈసమావేశంలో 12న జరిగే సియం సహా మంత్రి వర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్ల ప్రగతిని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులతో సమీక్షించారు.
ఈసమావేశంలో అదనపు డిజిపి ఎస్.బాగ్చి,జిఏడి కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి బాబు ఏ, చీఫ్ కమీషనర్ స్టేట్ ట్యాక్సెస్ గిరిజా శంకర్ పాల్గొన్నారు.అదే విధంగా స్పెషల్ సిఎస్ కె.విజయానంద్, టిఆర్అండ్బి కార్యదర్శి ప్రద్యుమ్న,సిఆర్డిఏ కమీషనర్ వివేక్ యాదవ్,ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు,విజయవాడ పోలీస్ కమీషనర్ పిహెచ్డి రామకృష్ణ, డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ మురళి తదితర శాఖల అధికారులు వర్చువల్ గా ఈసమావేశంలో పాల్గొన్నారు.
What's Your Reaction?






