వ్యవసాయ కూలీలతో వెళుతున్న వాహనం బోల్తా

వ్యవసాయ కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా
ఉరవకొండ జనసాక్షి :
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులోని గుంతకల్లు రోడ్డులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళుతున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 25 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… వజ్రకరూరు మండల కేంద్రం ఎస్సీ కాలనీ నుంచి మిరప పంట కోత నిమిత్తం 40 కూలీలతో బొలేరో వాహనం పాల్తూరుకు బయళ్దేరింది. వాహనం ఉరవకొండ పట్టణ శివారులోని చాకలి వంక వద్దకు రాగానే ముందుటైరు పగిలిపోయింది. దీంతో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న 25 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు.
What's Your Reaction?






