పర్యాటక అభివృద్ధిలో తొలి అడుగు

Jan 3, 2025 - 16:13
Jan 3, 2025 - 16:16
 0  361
పర్యాటక అభివృద్ధిలో  తొలి అడుగు

ప‌ర్యాట‌క అభివృద్ధిలో తొలి అడుగు

జనసాక్షి ,విజ‌య‌న‌గ‌రం(తాటిపూడి), 

జిల్లా ప‌ర్యాట‌క అభివృద్ధిలో తొలి అడుగు ప‌డింద‌ని రాష్ట్ర సెర్ప్‌, చిన్న‌ప‌రిశ్ర‌మ‌లు, ఎన్‌.ఆర్‌.ఐ. వ్య‌వ‌హారాల మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. గంట్యాడ మండ‌లంలోని తాటిపూడి రిజ‌ర్వాయ‌రులో ప‌ర్యాట‌క అభివృద్ధిలో భాగంగా సాహ‌స జ‌ల‌క్రీడ‌ల‌ను(Adventure Water Sports) మంత్రి శుక్ర‌వారం ప్రారంభించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌బ్లిక్ ప్రైవేట్ భాగ‌స్వామ్య‌(పిపిపి) విధానంలో ప‌ర్యాట‌క అభివృద్ధిని ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించింద‌ని, దీనిలో భాగంగా ఎన్‌.ఆర్‌.ఐ. సంస్థ వాట‌ర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా ఆధ్వ‌ర్యంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించామ‌న్నారు. అడ్వెంచ‌ర్ వాట‌ర్ స్పోర్ట్స్ లో భాగంగా రిజ‌ర్వాయరులో తొలి ద‌శ‌లో వాట‌ర్ ట్యాక్సీలు, స్పీడ్ బోట్లు ఏర్పాటు చేశార‌ని, రెండో ద‌శ‌లో జ‌ల‌క్రీడ‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నార‌ని, మూడో ద‌శ‌లో హౌస్‌బోట్లు, ఫ్లోటింగ్ కాటేజ్ లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. సుమారు రూ.5 కోట్ల వ్య‌యంతో యీ సంస్థ ఇక్క‌డ బోటింగ్ ఏర్పాట్లు చేస్తోంద‌న్నారు. ఈ ప్రాంతానికి చెందిన యువ‌త‌కే త‌గిన శిక్ష‌ణ ఇచ్చి బోట్ల ద్వారా ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. అమెరికాలో వుండే స్థాయిలో పూర్తిస్థాయి భ‌ద్ర‌త ప్ర‌మాణాల‌ను పాటించి బోటింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ప‌ర్యాట‌కుల కోసం రాత్రి వేళ‌ల్లో లైటింగ్ ఏర్పాట్లు, మ‌రుగుదొడ్లు వంటి వ‌స‌తుల‌ను క‌ల్పించ‌నున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. విశాఖ మీదుగా అర‌కు ప్ర‌యాణించే పర్యాట‌కుల‌కు బోటు రైడింగ్ ఒక ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌న్నారు. 

రిజ‌ర్వాయ‌రు అవ‌త‌ల వున్న దిగువ కొండ‌ప‌ర్త గ్రామ గిరిజ‌నుల కోసం అట‌వీశాఖ ఆధ్వ‌ర్యంలో బోటు సౌక‌ర్యాన్ని కూడా త్వ‌ర‌లోనే పున‌రుద్ద‌రించేందుకు చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని మంత్రి వెల్ల‌డించారు. 

ప్రాజెక్టుకు గొర్రిపాటి బుచ్చి అప్పారావు పేరుతో ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ ఇచ్చిన రోజే ప‌ర్యాట‌క అభివృద్ధికి నాంది ప‌ల‌క‌డం ఎంతో ఆనంద‌దాయ‌క‌మ‌ని మంత్రి చెప్పారు. తాటిపూడి ప్రాజెక్టు యీ ప్రాంతానికి రావ‌డంలో స్వ‌ర్గీయ బుచ్చి అప్పారావు కృషి ఎంతో వుంద‌న్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్ర‌భుత్వానికి గ్యాప్ ఫండింగ్ వ‌చ్చిన‌పుడు సామాజికంగా నిధుల స‌మీక‌ర‌ణ చేప‌ట్ట‌డం ద్వారా ఆ లోటును పూడ్చి ప్రాజెక్టును సుసాధ్యం చేయ‌డంలో తోడ్పాటు అందించార‌ని చెప్పారు. 

విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే అదితి గ‌జ‌ప‌తి మాట్లాడుతూ ప‌ర్యాట‌క అభివృద్ధిని ప్రోత్స‌హించ‌డంతోపాటు స్థానికుల‌కు ఉద్యోగ‌వ‌కాశాలు క‌ల్పించేలా ప్రాజెక్టును రూపొందించ‌డం యీ ప్రాంతానికి ఎంతో ప్ర‌యోజ‌న‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. తూర్పుకాపు కార్పొరేష‌న్ చైర్ ప‌ర్స‌న్ పాల‌వ‌ల‌స య‌శ‌స్విని మాట్లాడుతూ భ‌ద్రాచ‌లం ప్రాంతాన్ని మ‌రిపించే రీతిలో ఇక్క‌డ రిజ‌ర్వాయ‌రులో ప‌ర్యాట‌కుల‌కు వ‌స‌తులు క‌ల్పించ‌డంపై హ‌ర్షం వ్య‌క్తంచేశారు. జిల్లాలో ఇటువంటి రిజ‌ర్వాయ‌రు వున్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్టు చెప్పారు.అడ్వెంచ‌ర్ వాట‌ర్ స్పోర్ట్స్‌లో భాగంగా ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌త‌కు అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని నిర్వాహ‌క సంస్థ వాట‌ర్ స్పోర్ట్స్ సింపుల్ కార్య‌నిర్వహ‌ణ అధికారి జి.పాపారావు చెప్పారు. అమెరికాలో వాట‌ర్ స్పోర్ట్స్ నిర్వ‌హ‌ణలో వున్న అనుభ‌వంతో తెలంగాణ‌, ఒడిశా, ఏపిలో త‌మ సంస్థ ఈ రంగంలో ప‌లు ప్రాజెక్టులు నిర్వ‌హిస్తోంద‌న్నారు. ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌త కోసం లైఫ్ బ్యాగ్స్‌, లైఫ్ జాకెట్స్ త‌దిత‌ర భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌న్నీ చేప‌డుతున్న‌ట్టు చెప్పారు. నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాట‌ర్ స్పోర్ట్స్ పేర్కొన్న ప్ర‌మాణాల మేర‌కు ఆ సంస్థ నుంచి లైసెన్స్ పొందిన వారినే నియ‌మించామ‌న్నారు. రెండు సీట్లు గ‌ల బోట్లు రెండు, నాలుగు సీట్లు గ‌ల పెడ‌ల్‌ బోటు ఒక‌టి, ఐదు సీట్ల బోటు ఒక‌టి, 10 సీట్లు గ‌ల బోటు ఒక‌టి, 16 సీట్ల వాట‌ర్ ట్యాక్సీ ఒక‌టి ఇక్క‌డ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ప‌ర్యాట‌కుల కోసం ప్ర‌తి రోజు ఉద‌యం 9 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు బోట్ల‌లో ప‌ర్య‌టించే అవ‌కాశం వుంటుంద‌ని చెప్పారు. బోటును బ‌ట్టి రూ.100, రూ.150, రూ.200గా టికెట్ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో కొండ‌ప‌ల్లి కొండ‌ల‌రావు, ప్రాజెక్టు క‌మిటీ ఛైర్మ‌న్‌ జ‌గ‌న్నాథం, జ‌ల‌వ‌న‌రుల శాఖ ఇ.ఇ. వెంక‌ట‌ర‌మ‌ణ‌, జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow