దగదర్తి విమానాశ్రయం ఎందుకు ఆలస్యం అవుతోంది - ఎంపీ.వేమి రెడ్డి
దగదర్తి విమానాశ్రయం ఎందుకు ఆలస్యం అవుతోంది
– పార్లమెంట్‌లో ప్రశ్నించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
– ఎయిర్‌పోర్టు నిర్మాణంలో ఆలస్యం, అభివృద్ధి పనుల గడువుపై వివరణ కోరిన ఎంపీ
– మూడుసార్లు టెండర్లు పిలిచినా బిడ్లు ఖరారు కాలేదని స్పష్టం చేసిన కేంద్రం
నెల్లూరు జిల్లాలోని దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న ఆలస్యం, టెండర్ల పురోగతి, మొదటి విడత పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చే సమయపరిమితిపై నెల్లూరు లోక్‌సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంటులో లిఖితపూర్వకంగా ప్రశ్నించారు. ఎంపీ వేమిరెడ్డి గారి ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్ గురువారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 2016లోనే సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. పీపీపీ (PPP) పద్ధతిలో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు 2016 జూన్ 7న టెండర్లు పిలవగా, 2018 జూన్‌లో కన్సెషన్ ఒప్పందం కుదిరిందని.. అయితే ఎంపిక చేసిన బిడ్డర్ నిర్దేశిత గడువులోగా నిధుల సర్దుబాటు చేయలేకపోవడంతో 2020లో ఆ ఒప్పందాన్ని రద్దు చేసినట్లు వివరించారు.ప్రైవేట్ భాగస్వామి ఎంపిక కోసం 2025 సెప్టెంబర్ 5న నూతన టెండర్ ప్రకటన విడుదల చేశారని తెలిపారు. 2026 మార్చి 5న రెండో సారి, 2026 మే 29న మూడో సారి టెండర్లు పిలిచినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి బిడ్లు ఖరారు కానట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ విధానం ప్రకారం, విమానాశ్రయ ప్రాజెక్టును అమలు చేసే బాధ్యత సంబంధిత కంపెనీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. భూసేకరణ, అవసరమైన అన్ని రకాల అనుమతుల లభ్యత, నిధుల సర్దుబాటు వంటి అంశాలపై ఆధారపడి నిర్మాణ ప్రక్రియ ముడిపడి ఉంటుందని వివరించారు. నెల్లూరు జిల్లా ప్రజల సుదీర్ఘ స్వప్నమైన దగదర్తి ఎయిర్‌పోర్టు పనులు వేగవంతమై త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ వేదికగా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
What's Your Reaction?