దేవాలయాల చోరీల కేసుల్లో 13 మంది అరెస్ట్
దేవాలయ చోరీల కేసుల్లో 13 మంది అరెస్ట్
-రూ.22.70 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడిన 13 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.సి.ఎస్.పురం, పామూరు, కనిగిరి, కొనకనమిట్ల మండలాల్లోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడిన నిందితులను పామూరు మండలం రావిగుంటపల్లి గ్రామ శివారులో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.నిందితుల నుంచి సుమారు రూ.22.70 లక్షల విలువైన పంచలోహ, ఇత్తడి విగ్రహాలు, వెండి వస్తువులు, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చోరీలకు ఉపయోగించిన రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.నిందితుల్లో కొందరు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ ఒకరికొకరు పరిచయం ఏర్పరచుకున్నారని, పాత నేరస్తుడైన ఒక నిందితుడు దేవాలయాల్లో చోరీలకు పాల్పడితే సులభంగా డబ్బు సంపాదించవచ్చని సలహా ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ముందుగా దేవాలయాలను పరిశీలించి, అనంతరం చోరీలకు పాల్పడినట్లు చెప్పారు. చోరీ చేసిన సొత్తును స్వీకరించే వ్యక్తి కూడా నిందితుల్లో ఉన్నట్లు తెలిపారు.తన పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాలు మరియు విశ్వసనీయ సమాచారంతో దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.దేవాలయాల భద్రత కోసం ముఖ్యమైన ప్రాంతాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని ఎస్పీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
కేసులను ఛేదించడంలో కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
What's Your Reaction?