ఇంటర్ పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు

Jan 30, 2025 - 11:25
Jan 30, 2025 - 11:28
 0  37
ఇంటర్ పరీక్షలకు పగడ్బందీ  ఏర్పాట్లు

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

-వచ్చేనెల 5 నుంచి ఇంటర్‌ ప్రాక్టీకల్స్‌

-మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్‌ సాధారణ పరీక్షలు

-పరీక్షా కేంద్రాల్లో అన్ని భద్రతా చర్యలు

-జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్‌రావు

నెల్లూరు, జనసాక్షి  జనవరి : జిల్లాలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్‌రావు సూచించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్‌లోని డిఆర్‌వో చాంబర్‌లో ఇంటర్‌ పరీక్షలపై కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌వో ఉదయభాస్కర్‌రావు మాట్లాడుతూ జిల్లాలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇంటర్‌ ఒకేషనల్‌, 10వ తేదీ నుంచి ఇంటర్‌ జనరల్‌ ప్రాక్టీకల్స్‌ ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరుగుతాయన్నారు. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ సాధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్‌బోర్డు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రధానంగా పరీక్షల సమయంలో పరీక్షాకేంద్రాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రథమచికిత్స కేంద్రాలను ఏర్పాటుచేయాలని డిఎంఅండ్‌హెచ్‌వోకు సూచించారు. పరీక్షా పత్రాలను జిల్లా కంట్రోల్‌ రూం నుంచి సెంటర్లకు పటిష్ట భద్రత మధ్య తరలించాలని, పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్‌ అడిషనల్‌ కమిషనర్‌కు సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, విద్యుత్‌ సరఫరా, కుర్చీలు, ఫ్యాన్లు మొదలైన మౌలిక వసతులు సమకూర్చుకోవాలని, అన్ని పరీక్షా కేంద్రాలను ముందుగా పర్యవేక్షించాలని ఆర్‌ఐవోకు సూచించారు. ఆర్టీసీ అధికారులు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులకు సకాలంలో చేరుకునేలా బస్సులను నడపాలని సూచించారు. అవసరమైన చోట ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటుచేయాలన్నారు. ఇంటర్‌ ప్రాక్టీకల్స్‌, సాధారణ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేపట్టాలని అధికారులకు సూచించారు.

తొలుత ఆర్‌ఐవో శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 141 సెంటర్లలో ఇంటర్‌ ప్రాక్టీకల్స్‌, 79 సెంటర్లలో ఇంటర్‌ సాధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇంటర్‌ ప్రాక్టీకల్స్‌కు 25782 మంది విద్యార్థులు, ఇంటర్‌ పరీక్షలకు 54200 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఆయన చెప్పారు. ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే విద్యార్థులు కాల్‌ సెంటర్‌ నెంబరు 0861-2320312లో సంప్రదించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. పరీక్షల నిర్వహణకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. 

ఈ సమావేశంలో మున్సిపల్‌ అడిషనల్‌ కమిషనర్‌ వై.ఒ.నందన్‌, డిఎంఅండ్‌హెచ్‌వో సుజాత, డిఇవో బాలాజీరావు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజయన్‌, జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow