సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యాలు ఏటికొప్పాక బొమ్మలు
-76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ శకటానికి మూడోస్థానం దక్కడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి కందుల దుర్గేష్
-ఏటికొప్పాక బొమ్మల కొలువు థీమ్ తో ఏపీ శకటం రూపొంది పలువురి మన్ననలు పొందడం ఆనందంగా ఉందన్న మంత్రి దుర్గేష్
-ఏటికొప్పాక బొమ్మల కొలువు శకటం రూపొందించిన బృందానికి అభినందనలు తెలిపిన మంత్రి దుర్గేష్
అమరావతి జనసాక్షి : 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య్ పథ్ లో నిర్వహించిన పరేడ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం మూడవ స్థానంలో నిలవడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆనందం వ్యక్తం చేశారు. అధ్యాత్మిక భావంతో పాటు రాష్ట్ర సంస్కృతిక వైభవాన్ని చాటేలా తీర్చిదిద్దిన శకటం దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు ప్రజల మనసును దోచుకోవడం సంతోషానిచ్చిందన్నారు. శకటం ముందు పర్యావరణ హితంగా, సహజసిద్ధమైన వనరులతో సృజనాత్మకంగా తయారు చేసిన వినాయకుడు, చివర ఎత్తైన శ్రీ వేంకటేశ్వరస్వామి రూపాలు, ఇరువైపులా బొబ్బిలి వీణలు, తెలుగువారి కట్టుబొట్టును ప్రతిబింబించేలా బొమ్మల కొలువు, శకటం ప్రాధాన్యతను వివరిస్తూ కళాకారులు, చిన్నారుల నాట్యం పలువురిని ఆకట్టుకోవడంతో 3వ స్థానంలో నిలిచామని వివరించారు. కూటమి ప్రభుత్వ హస్తకళలకు ప్రాధాన్యతనిస్తోందని, విస్తృతంగా ప్రచారం సైతం కల్పిస్తోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏటికొప్పాక బొమ్మల శకటం తయారు చేసిన, హస్తిన వేదికపై ప్రదర్శించిన బృందానికి ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. అదే విధంగా తొలి స్థానంలో నిలిచిన యూపీ మహాకుంభ్ శకటం, రెండో స్థానంలో త్రిపుర రాష్ట్ర శకటం రూపకర్తలకు అభినందనలు తెలిపారు.