ఆంధ్ర ప్రదేశ్ లో పౌర విమాన యానం అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమిటి - ఎంపీ

Dec 12, 2024 - 16:50
 0  83
ఆంధ్ర ప్రదేశ్ లో పౌర విమాన యానం   అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమిటి - ఎంపీ

ఆంధ్రప్రదేశ్‌లో పౌర విమానయానం అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి

-లోక్‌సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రశ్న

 ఆంధ్రప్రదేశ్‌లో పౌర విమానయానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం లోక్‌సభలో ఈ మేరకు పలు అంశాలపై ఆయన ప్రశ్నించారు. దేశంలో విమానాశ్రయాల స్థితికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా సర్వే చేపట్టిందా అని అడిగారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపాదించిన విమానాశ్రయాలు పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని తెలియజేయాలన్నారు. అలాగే ఏవియేషన్ ప్రాజెక్టుల ప్రయోజనం కోసం కేటాయించిన, వినియోగించిన నిధులపై ఆరా తీశారు. 

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారి ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ మోహుల్‌ సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 158 విమానాశ్రయాలు పనిచేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 6 విమానాశ్రయాలు పనిచేస్తున్నాయన్నారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 21 గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదించగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి దగదర్తి, భోగాపురం, ఓర్వకల్‌ ప్రతిపాదిత విమానాశ్రయాలు ఉన్నాయన్నారు.

ప్రస్తుతం 21 గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలకు గాను 12 విమానాశ్రయాల పనులు ప్రారంభం అయ్యాయని వివరించారు. విమానాశ్రయాల విస్తరణ, ఆధునీకరణ ఒక నిరంతర ప్రక్రియ అని, భూమి లభ్యత, వాణిజ్య సాధ్యత, సామాజిక-ఆర్థిక పరిగణనలు, ట్రాఫిక్ డిమాండ్, విమానయాన సంస్థల సుముఖత ఆధారంగా ఎప్పటికప్పుడు ఎయిర్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), ఇతర ఎయిర్పోర్ట్ పై ఆధారపడి ఉంటుందన్నారు.

నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ (NIP) కింద 2019–24లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్స్‌, కొత్త టెర్మినల్స్ నిర్మాణం, టెర్మినల్స్ విస్తరణ, ఆధునీకరణ, రన్వేల బలోపేతం చేస్తుంటారన్నారు.అందులో భాగంగా విజయవాడ విమానాశ్రయంలో ఆప్రాన్, అనుబంధ పనులతో సహా కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, తిరుపతి విమానాశ్రయంలో ATC టవర్ కమ్ టెక్నికల్ బ్లాక్ నిర్మాణం, కడప విమానాశ్రయంలో కొత్త డొమెస్టిక్ డిపార్చర్ టెర్మినల్ భవనం, రాజమండ్రి విమానాశ్రయంలో కొత్త డొమెస్టిక్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణాన్ని AAI చేపట్టిందని వివరించారు.

అలాగే దేశవ్యాప్తంగా సేవలందించని, తక్కువ సేవలందిస్తున్న 50 విమానాశ్రయాలు/ హెలిప్యాడ్లను 2023-26ల మధ్య అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow