హోటల్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీలు వసూలు చేయరాదు

Sep 16, 2026 - 14:46
Sep 16, 2026 - 14:48
 0  8
హోటల్లు, రెస్టారెంట్లలో  సర్వీస్ ఛార్జీలు వసూలు చేయరాదు

హోటళ్లు, రెస్టారెంట్లలో తప్పనిసరి సర్వీస్ ఛార్జీ వసూలు చేయరాదు..!

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

-వినియోగదారుల ఇష్ట ప్రకారమే చెల్లింపు ఉండాలి*

కడప, సెప్టెంబర్ శిఖర జనసాక్షి : హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు తదితర సంస్థల్లో వినియోగదారుల నుంచి తప్పనిసరిగా సర్వీస్ ఛార్జీ వసూలు చేయరాదని.. వినియోగదారుల హక్కులను కాపాడేందుకు కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ జారీ చేసిన నిబంధనలను సంబంధిత సంస్థలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సూచించారు.2022 జూలై 4న కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీ వసూలుకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. సర్వీస్ ఛార్జీకి సంబంధించిన నిబంధనలపై హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌ల నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కేంద్రం కోరిందని కలెక్టర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు.వినియోగదారులపై అనవసరమైన రుసుములు వేయకుండా, బిల్లింగ్‌లో పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లు తమ బిల్లుల్లో సర్వీస్ ఛార్జీని ముందుగానే కలిపి వసూలు చేయరాదని తెలిపారు. వినియోగదారుడు స్వచ్ఛందంగా చెల్లిస్తే తప్ప, సర్వీస్ ఛార్జీని తప్పనిసరి చేయకూడదన్నారు. సర్వీస్ ఛార్జీ పేరుతో కాకుండా ఇతర పేర్లతో వసూలు చేసినా, అది సర్వీస్ ఛార్జీ కిందకే వస్తుందని తెలిపారు. సర్వీస్ ఛార్జీ చెల్లించలేదనే కారణంతో వినియోగదారుడిని హోటల్ లేదా రెస్టారెంట్‌లోకి అనుమతించకుండా ఉండటం, సేవలు అందించకపోవడం వంటి చర్యలకు పాల్పడరాదని స్పష్టం చేశారు. వినియోగదారుడు ఏ సేవకు ఎంత చెల్లించాలో బిల్లులో స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు.అలాగే సర్వీస్ ఛార్జీకి బదులుగా ‘సిబ్బంది సంక్షేమ రుసుము’, ‘ఉద్యోగుల సంక్షేమ రుసుము’, ‘సర్వీస్ ఫీజు’, ‘హాస్పిటాలిటీ ఛార్జీ’ వంటి పేర్లు పెట్టి తప్పనిసరిగా డబ్బు వసూలు చేసినా, దానిని సర్వీస్ ఛార్జీగానే పరిగణిస్తామని తెలిపారు. పేరు మార్చినంత మాత్రాన నిబంధనల నుంచి తప్పించుకునే అవకాశం లేదన్నారు.సర్వీస్ ఛార్జీని ఆహార బిల్లులో కలిపి, దానిపై వస్తు సేవల పన్ను విధించకూడదని కూడా నిబంధనల్లో స్పష్టం చేసినట్లు తెలిపారు. వినియోగదారులు తమకు ఇచ్చే బిల్లును జాగ్రత్తగా పరిశీలించాలని, అదనంగా ఏదైనా రుసుము వసూలు చేస్తున్నారా లేదా అన్నది గమనించాలని సూచించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow