రాష్ట్రానికి అండగా ఉంటాం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్

న్యూఢిల్లీ/విజయవాడ
రాష్ట్రానికి అండగా ఉంటాం - కేంద్ర సాయం త్వరగా అందేలా చూస్తా: కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్
రాష్ట్రంలో వరదల గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ చెప్పారు. అంతే కాకుండా కేంద్రం నుంచి సాయం త్వరగా అందేలా చూస్తానని కేంద్ర కమిటీ నివేదిక చూశాక ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చౌహాన్ సహాయ కార్యక్రమాలు బాగా చేశారని ప్రశంసించారు.
ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారని చౌహాన్ కొనియాడారు.
బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. విజయవాడలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద విపత్తుపై కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. వరద నష్టాన్ని ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు లోకేష్, అనిత, మనోహర్, అచ్చెన్నాయుడు పాల్లొన్నారు.
ఫొటో ఎగ్జిబిషన్ అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంభవించిన వరదల గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని తెలిపారు. అంతే కాకుండా త్వరగా కేంద్ర సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర కమిటీ నివేదిక చూశాక ఆర్థిక సాయం అందుతుందని ఇలాంటి కష్టసమయంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందని శివరాజ్‌సింగ్ అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో బుడమేరు వద్ద ఆక్రమణలు పెరిగాయని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ మండిపడ్డారు. ప్రజలు ఐదు రోజులపాటు వరదనీటిలో ఉండిపోయారని వారి ప్రాణాలు కాపాడేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారని కొనియాడారు. అంతే కాకుండా దగ్గరుండి మరీ సహాయ కార్యక్రమాలు సీఎం పర్యవేక్షించారని అన్నారు. వరద ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ సహాయ కార్యక్రమాలు బాగా చేశారని అభినందించారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించడం దేశంలోనే తొలిసారని పేర్కొన్నారు. తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ అన్నారు.
ప్రకాశం బ్యారేజీ సామర్థ్యంపై అమిత్‌షా, నిపుణులతో చర్చిస్తామని శివరాజ్‌సింగ్ అన్నారు. బుడమేరు సమీపంలో అక్రమ మైనింగ్ జరపడం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నట్లు తెలిసిందని తెలిపారు. కృష్ణా నది, బుడమేరు రెండూ ఒకే సారి పొంగాయని దీంతో గతంలో ఎన్నడూ చవి చూడని జల ప్రళయాన్ని ఇప్పుడు విజయవాడ చవి చూసిందని విచారం వ్యక్తం చేశారు. వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కలెక్టరేటునే సెక్రటేరీయేట్ చేసుకుని చంద్రబాబు, ఆయన బృందం 24 గంటలూ పని చేశారని కేంద్ర మంత్రి కొనియాడారు.
చంద్రబాబు చిత్త సుద్ధితో పని చేయబట్టే ఇంతటి జల ప్రళయం సంభవించినా మృతులు సంఖ్యని తగ్గించగలిగారు. ఐఏఎస్ అధికారులకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. వరదసాయంపై బాధితులు సంతృప్తితో ఉన్నారు. పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. దీనిపై త్వరలోనే కేంద్ర బృందాలు జరిగిన నష్టంపై అంచనా వేస్తాయి. గత ప్రభుత్వం ఫసల్ బీమా యోజనా పథకాన్ని పట్టించుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుంది. శివరాజ్‌సింగ్, కేంద్ర మంత్రి
బ్యారేజ్ సామర్థ్యం పెంచేందుకు అధ్యయనం:* ప్రకాశం బ్యారేజ్‌కు 15 లక్షల క్యూసెక్కులు వచ్చినా తట్టుకునేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంకా బ్యారేజ్ సామర్థ్యం పెంచేందుకు అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతోందని శుక్రవారం నుంచి పనుల్లో పాల్గొంటుందని వివరించారు. కృష్ణా నది కరకట్టలు మరింత పటిష్టం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
What's Your Reaction?






