ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు పూర్తి

Jun 11, 2024 - 21:14
Jun 11, 2024 - 21:22
 0  369
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని  వీక్షించేందుకు  ఏర్పాట్లు పూర్తి

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని 

వీక్షించేందుకు ఏర్పాట్లు పూర్తి

- జిల్లావ్యాప్తంగా 12 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు

- జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వికాస్

- ప్రమాణ స్వీకారానికి జిల్లా నుంచి 32 ఆర్టీసీ బస్సులు

- విద్యుత్ దీపాలంకరణలో ప్రభుత్వ కార్యాలయాలు

నెల్లూరు జనసాక్షి  : ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడి  ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లాలో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు. మంగళవారం ఉదయం నెల్లూరు కార్పొరేషన్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వికాస్ మర్మత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ సభా ప్రాంగణంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా, ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లావ్యాప్తంగా 12 ప్రదేశాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. 

సీఎం ప్రమాణస్వీకారాన్ని వీక్షించేందుకు

ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసిన ప్రదేశాలు ఇవే! 

నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో గల తిక్కన ప్రాంగణం, కోటమిట్ట షాదీమంజిల్‌, స్టోన్‌హౌస్‌పేటలోని బివిఎస్‌ హైస్కూలు, గాంధీబొమ్మ సమీపంలోని స్వతంత్ర పార్కు, నెల్లూరురూరల్‌ మండల పరిధిలోని కస్తూర్భ కళాక్షేత్రం, మాగుంటలేఅవుట్‌లోని అనిల్‌గార్డెన్స్‌లో సీఎం గారి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే కందుకూరులో వెంగమాంబ కల్యాణ మండపం, కావలిలో బృందావనం కల్యాణ మండపం, ఆత్మకూరులో రవితేజ కల్యాణమండపం, బుచ్చిరెడ్డిపాలెంలో ఎంఎం ఫంక్షన్‌హాలు, వెంకటాచలం సమీపంలోని శ్రీడ్స్‌ కల్యాణమండపం, ఉదయగిరిలోని టీటీడీ కల్యాణమండపాల్లో సీఎం గారి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. 

గన్నవరానికి 32 బస్సులు

ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలను గన్నవరం తీసుకెళ్లేందుకు జిల్లా వ్యాప్తంగా 32 బస్సులు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి రెండు ఆర్టీసీ బస్సులు నిర్దేశించిన ప్రాంతాల నుంచి గన్నవరం చేరుకుంటాయి. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గం నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వికాస్, కోవూరుకు జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, కావలి, కందుకూరుకు సబ్ కలెక్టర్ విద్యాధరి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు బాపిరెడ్డి, సర్వేపల్లి కి డిఆర్ఓ లవన్న బస్సులకు సంబంధించిన ఇన్చార్జులుగా వ్యవహరించినన్నారు. మంగళవారం రాత్రి 10 గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంటాయి. అక్కడ ఫ్రెష్ అప్, అల్పాహారం అనంతరం గన్నవరం సమీపంలోని ప్రమాణ స్వీకార సభా ప్రాంగణానికి చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జుల సమన్వయంతో పాసులు పొందిన వారిని సురక్షితంగా గన్నవరం తీసుకెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే బస్సుల్లో వెళ్లిన వారిని తిరిగి ఆయా ప్రాంతాలకు చేర్చేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 

విద్యుత్ దీపాలంకరణలో ప్రభుత్వ కార్యాలయాలు

ముఖ్యమంత్రిగా  చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఈనెల 12వ తేదీ రాత్రి వరకు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దీపాల అలంకరణ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నెల్లూరు కలెక్టరేట్ తో పాటు అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు విద్యుత్ కాంతులతో శోభాయమానంగా మారాయి. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, డిఆర్ఓ లవన్న, నుడా విసి బాపిరెడ్డి, డిఆర్డిఏ, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లు సాంబశివారెడ్డి, వెంకట్రావు, ఆర్టీసీ ఆర్ఎం శేషయ్య, జడ్పీ సీఈవో కన్నమనాయుడు తదితరులు పాల్గొన్నారు. 

.

DIPRO, NELLORE

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow