నెల్లూరు జిల్లా చింతా రెడ్డిపాలెం జంక్షన్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

Nov 9, 2025 - 16:58
Nov 9, 2025 - 17:04
 0  105
నెల్లూరు జిల్లా చింతా రెడ్డిపాలెం జంక్షన్  వద్ద  అండర్ పాస్  బ్రిడ్జి   ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

ఏళ్ల కల.. విపిఆర్‌ కృషితో నెరవేరిన వేళ

నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు.. తరచూ రోడ్డు ప్రమాదాలు.. రహదారి దాటాలంటే డేంజర్‌ బెల్స్‌.. ఇది ఇప్పటివరకు జాతీయ రహదారి - 16 పై చింతారెడ్డిపాలెం జంక్షన్‌ పరిస్థితి. ఇకపై ఆ పరిస్థితుల్లో మార్పులు రానున్నాయి. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు  వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి  అవిశ్రాంత శ్రమతో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి - 16 చింతారెడ్డిపాలెం జంక్షన్‌ వద్ద వెహికల్‌ అండర్‌పాస్‌ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా రూ.115 కోట్లు కేటాయించింది. ఇన్నాళ్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పడిన కష్టానికి ఫలితం దక్కినట్లయింది. దాంతో స్థానిక ప్రజలు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు నిత్య శ్రామికుడిలా పనిచేస్తున్న ఎంపీ వేమిరెడ్డి ఉండటం తమ అదృష్టంగా భావిస్తున్నారు.

గెలిచినప్పటి నుంచి 4 సార్లు నితిన్‌ గడ్కరీతో సంప్రదింపులు

నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.. ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రజా సంక్షేమం, జిల్లా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో జాతీయ రహదారులపై ఉన్న సమస్యలు, చింతారెడ్డిపాలెం వద్ద వెహికల్‌ అండర్‌పాస్‌ ఏర్పాటు వంటి అంశాలపై కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో 4 సార్లు ఢిల్లీలో భేటీ అయి మాట్లాడారు. తొలిసారి జులై 24, 2024న ఢిల్లీలో నితిన్‌ గడ్కరీని కలిసిన ఎంపీ వేమిరెడ్డి.. చింతారెడ్డిపాలెం జంక్షన్‌ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. అలాగే జులై 25న ఇదే సమస్యను లోక్‌సభలో ప్రస్తావించారు. 

అనంతరం సెప్టెంబర్‌ 5, 2024న కేంద్ర రహదారుల అభివృద్ధి విభాగం డైరెక్టర్‌ జనరల్‌ సారంగితో భేటీ అయి సమస్యను వివరించారు. అలాగే నవంబర్‌ 27, 2024న ఒకసారి, డిసెంబర్ 18, 2024న మరోసారి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిశారు. ఇటీవల ఆగస్టు 18న రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ గారితో కలిసి నితిన్‌ గడ్కరీని కలిసిన ఎంపీ వేమిరెడ్డి.. జిల్లాలో జాతీయ రహదారుల సమస్యల పరిష్కారం, వెహికల్‌ అండర్‌పాస్‌ ఏర్పాటుపై ప్రత్యేకంగా చర్చించారు.

నిత్యం భయం.. భయం. ఎట్టకేలకు అభయం

జాతీయ రహదారి-16 నుంచి నెల్లూరు నగరంలోకి ప్రవేశించేందుకు చింతారెడ్డిపాలెం జంక్షన్‌ చాలా కీలకమైంది. నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు ఈ జంక్షన్‌ గుండా వెళుతుంటాయి. సమీపంలోనే ప్రముఖ మెడికవర్‌ హాస్పిటల్‌ ఉంటడంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఈ జంక్షన్‌ ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి కీలకమైన జంక్షన్ ట్రాఫిక్ కు ప్రధాన అడ్డంకిగా ఉంటూ.. ప్రమాదాలు జరుగుతుంటాయి. దాంతో ఇక్కడ వెహికల్ అండర్ పాస్ (VUP) కోసం ప్రజల నుంచి భారీ డిమాండ్ ఉంది. దీని ప్రాధాన్యతను, ప్రజల డిమాండ్‌ను గుర్తించిన ఎంపీ వేమిరెడ్డి.. పట్టువిడువని విక్రమార్కుడిలా కేంద్ర మంత్రిని పలుమార్లు కలిశారు. జంక్షన్‌ వద్ద వెహికల్‌ అండర్‌ పాస్ ఏర్పాటుకు ఒప్పించి 115 కోట్ల నిధులు మంజూరు చేయించేలా శ్రమించారు. దాంతోపాటు ప్రతిపాదిత చింతారెడ్డిపాలెం జంక్షన్‌ వెహికల్ అండర్ పాస్ (VUP) నుంచి ముత్తుకూరు రోడ్ వరకు జాతీయ రహదారి - 16కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు.

సీఎం, కేంద్రమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు

చింతారెడ్డిపాలెం జంక్షన్‌ వద్ద వెహికల్‌ అండర్‌ పాస్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కి, సీఎం చంద్రబాబు నాయుడు కి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇన్నాళ్లకు ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని చెప్పారు. ఇకపై ట్రాఫిక్‌ సమస్యలు, ప్రమాదాల బెడత తప్పుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా క్షేమమే ధ్యేయంగా మరింత ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. చింతా రెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపడితే ప్రమాదాల నివారణతో పాటు రాకపోకలకు సులువుగా ఉంటుందని, భయం గుప్పిట్లో బతుకుతున్న తమకు.. అభయం దొరికిందని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కలను నిజం చేస్తున్న ఎంపీ వేమిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow