వ్యర్ధాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ తమవంతుగా బాధ్యత వహించాలి కలెక్టర్ రాజాబాబు
వ్యర్ధాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ పి .రాజాబాబు పిలుపునిచ్చారు. ' ఆపరేషన్ క్లీన్ స్వీప్ ' కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం 60 అడుగుల రోడ్డులో ఉన్న పోతురాజు కాలువను శుభ్రం చేసే పనులను అధికారులు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొని పూడికతీత పనులను పరిశీలించారు. ఘన వ్యర్ధాల నిర్వహణ గురించి ప్రజలకు ఈ సందర్భంగా ఆయన అవగాహన కల్పించారు. ' ఆపరేషన్ క్లీన్ స్వీప్ ' కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య నిర్వహణపై నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా తొలి వారం రోడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ప్రస్తుతం రెండవ వారం మురుగు కాలువల నిర్వహణపై దృష్టి పెట్టామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఘన వ్యర్ధాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను రూపొందించిందన్నారు. ఆ నిబంధనలు అమలు చేసేందుకే ప్రతివారం ఈ విధమైన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ మార్గనిర్దేశం మేరకు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్లాస్టిక్ ను వినియోగించవద్దని, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను కాలువల్లో పడవేయొద్దని ప్రజలకు సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపాలిటీ తరఫున చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యత నిర్వహించి పారిశుధ్య నిర్వహణలో అధికార యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. పరిశుభ్రత వలన ఆరోగ్యము, ప్రత్యేక గౌరవం లభిస్తాయన్నారు.
What's Your Reaction?