తౌషిక్ మృతి ఘటనపై హాస్టల్ ను పరిశీలించిన మందా కృష్ణ మాదిగ
-తౌషిక్ మృతి ఘటనపై హాస్టల్‌ను పరిశీలించిన మందకృష్ణ మాదిగ
-బాత్రూంలో ఉరి వేసుకున్నాడని చెబుతున్న ప్రాంతాన్ని టేపుతో కొలిచిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
శిఖర జనసాక్షి, సింగరాయకొండ, సెప్టెంబర్ 20:
సింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ హాస్టల్లో విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం హాస్టల్‌ను పరిశీలించారు.తౌషిక్ మృతి చెంది ఆరు నెలలకు పైగా గడిచినప్పటికీ ఘటనకు సంబంధించిన అనుమానాలు పూర్తిగా నివృత్తి కాలేదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్న నేపథ్యంలో మందకృష్ణ మాదిగ హాస్టల్‌ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తౌషిక్ ఉరి వేసుకున్నాడని చెబుతున్న బాత్రూం ప్రాంతాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా తౌషిక్ మృతి చెందినట్లు చెబుతున్న ప్రదేశంలో బాత్రూం నిర్మాణం, పైభాగం, ఉరి వేసుకున్నాడని చెబుతున్న ప్రాంతం తదితర అంశాలను పరిశీలించారు. అక్కడి పరిస్థితులను అర్థం చేసుకునేందుకు టేపుతో ఆ ప్రాంతాన్ని కొలిచి, మృతికి సంబంధించిన వివరాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.తౌషిక్ మృతి చెందిన సమయంలో జరిగిన పరిణామాలు, హాస్టల్లోని పరిస్థితులు, ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి హాస్టల్ ప్రాంగణంలోకి ఇతరులను, చివరకు మీడియా ప్రతినిధులను కూడా అనుమతించలేదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్న నేపథ్యంలో మందకృష్ణ మాదిగ పరిశీలనకు ప్రాధాన్యత ఏర్పడింది.తౌషిక్ మృతి విషయంలో మొదటి నుంచీ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయం కోసం పోరాడుతున్నారు. తాజాగా తౌషిక్ తల్లి మౌలాబి కూడా తన కుమారుడి మృతిపై న్యాయం కోసం పోరాడుతూ మృతి చెందడంతో కుటుంబంలో విషాదం మరింత తీవ్రతరమైంది.ఈ నేపథ్యంలో తౌషిక్ మృతి, అనంతరం అతని తల్లి మౌలాబి మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. తౌషిక్ మృతి ఘటనకు సంబంధించిన అన్ని అనుమానాలను నివృత్తి చేసేలా సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.తౌషిక్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ఎఫ్ నాయకులు, ముస్లిం సామాజిక పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
What's Your Reaction?