తిరుమలలో ఘనంగా కార్తీక స్నపన తిరుమంజనం

తిరుమలలో ఘనంగా కార్తీక స్నపన తిరుమంజనం
జనసాక్షి : పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వన భోజన మహోత్సవం భాగంగా ఆదివారంనాడు తిరుమల వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ఇదులో భాగంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.సాధారణంగా కార్తీక మాసంలో పారువేట మండపంలో టీటీడీ వనభోజనం నిర్వహిస్తుంది. అయితే తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వేదికను తిరుమల ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపానికి మార్చారు. స్నపనం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆలయ పేష్కర్ శ్రీహరి, పోటు పేష్కర్ శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






