నెల్లూరు, డిసెంబర్ 21 : శనివారం ఉదయం నగరంలోని జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆనంద్, జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, కావలి, ఉదయగిరి ఎమ్మెల్యేలు దగ్గుమాటి కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలు అందరికీ అందాలనే అత్యున్నత లక్ష్యంతో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ దిశ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.పార్లమెంటు సభ్యుడిగా ప్రజలకు న్యాయం చేయడం తన బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను పర్యవేక్షిస్తూ, సమన్వయం చేసుకోవడమే ఈ దిశ సమావేశం ముఖ్య ఉద్దేశంగా ఎంపీ చెప్పారు. జిల్లా అభివృద్ధి ప్రణాళిక, ప్రభుత్వశాఖల మధ్య సమ్వనయంపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడానికి ప్రతి మూడు నెలలకొకసారి ఈ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం 67 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, ప్రతి పథకం ప్రయోజనాన్ని మన జిల్లా ప్రజలకు అందించడం, జిల్లా అభివృద్ధికి కృషి చేయడం పార్లమెంటు సభ్యుడిగా తన బాధ్యత అని వేమిరెడ్డి అన్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసినప్పుడు ఆయన ప్రధానంగా ఈ కమిటీ సమావేశంపైనే తనతో ప్రస్తావించారని, జిల్లాలో ఈ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని తనతో చెప్పారన్నారు. గుజరాత్ లో కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుని తన పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్థిలో అగ్రగామిగా నిలిపారని, ఒకసారి ఆ నియోజకవర్గాన్ని సందర్శించి అధ్యయనం చేయాలని ప్రధాని సూచించినట్లు ఎంపీ చెప్పారు. జిల్లాస్థాయి అధికారులందరూ కూడా తమశాఖల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు చేరువ చేయడానికి తమ వంతు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులకు ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర ప్రభుత్వం నుండి తగిన సహాయ సహకారాలు అందుతాయని ఎంపీ చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గాల సమస్యల పరిష్కారానికి పది పార్లమెంటు నియోజకవర్గాలను ఒక సీనియర్ కేంద్ర మంత్రికి కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలోని మారుమూల గ్రామానికి కూడా రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన పథకాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నిర్మిస్తున్న అన్ని గృహాలను కూడా పేదలకు ఉపయోగపడేలా త్వరగా నిర్మించాలన్నారు. జల్‌జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన, భేటీ బచావో భేటీ పడావో, పిఎం పోషణ (మిడే డే మీల్స్), జనని సురక్షి యోజన, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, కస్తూర్భగాంధీ బాలికల విద్యాలయాలు, సామాజిక పింఛన్లు, ఉపాధిహామీ పథకం, స్వచ్ఛభారత్ మిషన్ మొదలైన పథకాలను సక్రమంగా వినియోగించుకునేందకు ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలన్నారు.