కందుకూరుకు మరో 10 వాటర్ ప్లాంట్లు - ఎంపీ వేమిరెడ్డి

May 24, 2025 - 17:44
May 24, 2025 - 17:51
 0  300
కందుకూరుకు  మరో 10 వాటర్ ప్లాంట్లు - ఎంపీ వేమిరెడ్డి

కందుకూరుకు మరో 10 వాటర్ ప్లాంట్లు 

- ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం 

- విపిఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరింత ప్రోత్సా హం అందిస్తాం 

- విపిఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగసముద్రం, కరేడులో అమృత ధార వాటర్ ప్లాంట్ల ప్రారంభం 

- హాజరైన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

వెనుకబడిన ప్రాంతం కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. లింగసముద్రం మండల కేంద్రంలోని కేఆర్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్‌ను శనివారం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా పాఠశాల ఆవరణకు చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యేకు పాఠశాల విద్యార్థులు కోలాటంతో అపూర్వ పలికారు. అనంతరం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. మహిళలకు బిందెలతో నీటిని అందించారు. వాటర్ ప్లాంట్ భవన నిర్మాణ దాత, పాఠశాల పూర్వ విద్యార్థి అంగులూరి నరసింహారావును ఎంపీ వేమిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విపిఆర్‌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కందుకూరులో ఇప్పటివరకు ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, ఇప్పుడు మరో రెండు వాటర్ ప్లాంట్లను ప్రారంభించామన్నారు. కందుకూరుకు ప్రాధాన్యతనిస్తూ మరో 10 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ వల్ల అటు విద్యార్థులతో పాటు గ్రామస్తులకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. దాదాపు 2,000 మందికి మేలు జరుగుతుందని వివరించారు. లింగసముద్రం మండలం తమకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించిందని, ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా కట్టుబడి ఉన్నామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయనున్నారని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని తట్టుకొని సీఎం చంద్రబాబు  పాలన సాగిస్తున్నారన్నారు. ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. పాత, కొత్త నాయకులందరూ కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని, ఏమైనా చిన్న సమస్యలుంటే పరిష్కరించుకొని 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన కందుకూరుకు విపిఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్లను కేటాయించిన ఎంపీ వేమిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వాటర్ ప్లాంట్ ద్వారా దాదాపు 2000 మందికి ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోందని, పాఠశాల విద్య సమూలంగా అభివృద్ది చెందుతోందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులుn ప్రస్తావించిన పలు సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 

ఉలవపాడు మండలం కరేడులో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం స్విచ్ ఆన్ చేసి స్థానికులకు బిందెలతో నీటిని అందించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, జనసేన నాయకులు గుడిహరి రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow