ఏపీ అటల్ పింఛన్ యోజన వల్ల కలుగుతున్న ప్రయోజనం ఏంటి

ఏపీ అటల్ పెన్షన్ యోజన వల్ల కలుగుతున్న ప్రయోజనం ఏంటి
కేంద్ర ప్రభత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొంటున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం పలు అంశాలపై ఆయన లోక్‌సభలో ప్రశ్నలు వేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన(APY) పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు కలుగుతున్న ప్రయోజనాలపై ఆరా తీశారు. ప్రత్యేకించి అసంఘటిత రంగ కార్మికులలో APY కింద అవగాహన మరియు నమోదును పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు తెలియజేయాలని కోరారు. APY కింద ప్రయోజనాలను బదిలీ చేయడంలో ఎదురవుతున్న సవాళ్లపై ప్రశ్నించారు. అలాగే లబ్ధిదారులే లక్ష్యంగా పన్ను చెల్లింపుదారులను ఈ పథకం నుంచి తొలగించింది వాస్తవమేనా అని ఆరా తీశారు. కనీస గ్యారెంటీ పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిందా అని అడిగారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పేదలు, అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం సామాజిక భద్రతా వ్యవస్థను రూపొందించే లక్ష్యంతో 2015లో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారు APYలో చేరడానికి అర్హులు కాదని 2022లో నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం APY పథకం కింద పెన్షన్ రూ. 1000 నుంచి 5000 వరకు పింఛను అందుతుందన్నారు. అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) మరియు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)తో పాటు ప్రత్యేకంగా పేదలు, వెనుకబడిన వారి కోసం సామాజిక భద్రతా వ్యవస్థను రూపొందించామన్నారు.
డిసెంబర్ 2024 నాటికి దేశవ్యాప్తంగా APY కింద 7,25,77540 మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని SPSR నెల్లూరు జిల్లాలో 1,77490 మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. డిసెంబర్ 2024 నాటికి 43369.98 కోట్లు సేకరించినట్లు వివరించారు. ఇక పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ మాధ్యమాలను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. దేశంలోని 13 భాషల్లో ప్రత్యేక బ్రోచర్‌ను అందిస్తున్నామన్నారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో APY కి ప్రచారం కల్పిస్తున్నట్లు వివరించారు.
What's Your Reaction?






