8.09 లక్షల మందికి జగనన్న విద్యా దీవెన

జనసాక్షి భీమవరం
-8.09 లక్షల మందికి జగనన్న విద్యాదీవెన నిధులు రూ.584 కోట్లు జమ చేసిన సీఎం జగన్
-మనిషి తలరాతను మార్చే శక్తి కేవలం విద్యకి మాత్రమే ఉంది: సీఎం జగన్
-మూడుసార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా?: సీఎం జగన్
-దత్తపుత్రుడు ఓ త్యాగాల తాగ్యరాజు.. చంద్రబాబు కోసమే పవన్ జీవితం
మన రాష్ట్రంలో పిల్లలు గొప్పగా చదవాలని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాము" అని సీఎం జగన్ పేర్కొన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్ల నిధులను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.
ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం చెప్పారు. నేడు 8.09 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ జులై, ఆగస్టు, సెప్టెంబర్‌కు సంబంధించిన అక్షరాల రూ.583 కోట్లు నేరుగా జమ చేస్తున్నామని, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బందులు కలుగకూడదన్న ఉద్దేశంతో దాదాపుగా 2 లక్షల మంది విద్యార్థులకు చివరి ఇన్‌స్టాల్‌మెంట్ కూడా జమ చేశామని సీఎం తెలిపారు.
ఈ నాలుగున్నరేళ్లలో ఈ ఒక్క పథకానికే 27.61 లక్షల మంది పిల్లలకు వారి పూర్తి ఫీజులు తల్లిదండ్రుల తరఫున మంచి మేనమామగా అక్షరాల రూ.11,900 కోట్లు ఇచ్చామని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఈ నాలుగున్నరేళ్లలో పిల్లల బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల పేరుతో డబ్బులు ఇస్తూ అండగా నిలిచామని, దీని కోసం మరో రూ.4,275 కోట్లు ఇచ్చామని, ఈ రెండు పథకాలకు రూ.16176 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెప్పారు. పేదవాళ్ల బతుకులు మారాలని, గొప్ప డిగ్రీలతో బయటకు రావాలని, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని సీఎం ఆకాంక్షించారు. వీరు గొప్ప చదువులు చదివితే ఆ కుటుంబాల తల రాతలు మారుతాయని సీఎం పేర్కొన్నారు.
మన ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వం ఫీజులు రూ.1700 కోట్లు బకాయి పెట్టాయని, మీ కోసం మన ప్రభుత్వమే చెల్లించిందని సీఎం చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రూ.12 వేల కోట్లు కూడా సరిగ్గా ఖర్చు చేయలేదని, ఈ రోజు రూ.18500 కోట్లు ఖర్చు చేశామని , తేడా గమనించాలని సీఎం కోరారు.
-తలరాతను మార్చే శక్తి కేవలం విద్యకి మాత్రమే ఉంది*
చదువు అన్నది ఒక తలరాతలు మార్చే ఆస్తి అని మనిషి తలరాతలు కాని, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలంటే, దేశం భవిష్యత్ అన్నీ కూడా మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉందని సీఎం ఉద్ఘాటించారు. దీన్ని గట్టిగా నమ్మే ప్రభుత్వం కాబట్టే విద్యా విధానంలో స్కూళ్ల దగ్గరి నుంచి మొదలుపెడితే హైయ్యర్ ఎడ్యుకేషన్ దాకా ప్రతి అడుగు కూడా విప్లవాత్మకంగా అడుగులు వేశామని అన్నారు.
ఈ విద్యారంగంలోనే తీసుకువచ్చిన సంస్కరణలకు ఖర్చు చేసిన లెక్కలు గమనిస్తే వీటి కోసం రూ.73 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం తలిపారు. ఈ మార్పులు విద్యారంగంలోనే కాదు..వైద్యం, వ్యవసాయం, పరిపాలన సంస్కరణల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి మార్పులను ఏ ఒక్కటి చేయడానికి కూడా ఏనాడు గతంలో ఎవరూ ఆలోచన చేయలేదని అన్నారు.చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నారని, ప్రజలకు మంచి చేసేందుకు ఆ అధికారాన్ని ఉపయోగించలేదని, కేవలం తన అవినీతి కోసమే ఉపయోగించాడని సీఎం విమర్శించారు. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును దుష్ట చతుష్టయానికి వాటాలు పంచాడని ఆరోపించారు. కనీసం చెప్పుకోటానికి ఒక మంచి పథకం కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు.
What's Your Reaction?






