రోడ్డెక్కిన పొగాకు రైతులు - టంగుటూరు టోల్ గేట్ వద్ద హైవే దిగ్బంధం
రోడ్డెక్కిన పొగాకు రైతులు.. టంగుటూరు టోల్గేట్ వద్ద హైవే దిగ్బంధం
గిట్టుబాటు ధర కల్పించాలని, క్వింటాకు రూ.25 వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్
టంగుటూరు శిఖర జనసాక్షి : పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించి, గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పొగాకు రైతులు రోడ్డెక్కారు. ప్రకాశం జిల్లా రైతు సంఘాల బుధవారం టంగుటూరు టోల్గేట్ వద్ద రైతులు హైవేను దిగ్బంధించి నిరసన చేపట్టారు. దీంతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పొగాకు రైతులను ఆదుకోవాలని, పొగాకు బోర్డు/సమాఖ్యకు ప్రత్యేక నిధులు కేటాయించి రైతుల నుంచి పొగాకును కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. క్వింటాకు కనీసం రూ.25 వేల మద్దతు ధర కల్పించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.గత కొన్ని నెలలుగా పొగాకు రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతుల నుంచి పన్నులు, సెస్సు రూపంలో వేల కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్న ప్రభుత్వాలు, అదే రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.ప్రస్తుత పరిస్థితుల్లో పొగాకు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఒక్కో బ్యారన్‌కు సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని నాయకులు తెలిపారు. ఇప్పటికే అప్పులు చేసి పంట సాగు చేసిన రైతులు, గిట్టుబాటు ధరలు లేక మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని, ప్రత్యేక నిధులు కేటాయించి పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయాలని, క్వింటాకు రూ.25 వేల మద్దతు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వామపక్ష రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు, పొగాకు వేలం కేంద్రాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
What's Your Reaction?