రాబోయే 2027 నాటికి దగదర్తి విమానాశ్రయం పూర్తి -నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి

రాబోయే 2027 నాటికి దగదర్తి విమానాశ్రయం పూర్తి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాకు దగదర్తి విమానాశ్రయం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. శుక్రవారం రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి దగదర్తి విమానాశ్రయం భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై అధికారులతో ఎంపీ వేమిరెడ్డి చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగదర్తి ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై పట్టుదలగా ఉన్నారని, ఆయన ఆశీసులు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు సహకారంతో ఎయిర్ పోర్ట్ పూర్తి చేస్తామన్నారు. 2027 నాటికి ఎయిర్‌పోర్ట్ సాకారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎంపీ వేమిరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలను అధికారులతో చర్చించారు. రైతులకు సంబంధించి పరిహారం అంశంపై మాట్లాడారు. 1379 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలని ప్లాన్ చేశారని, 669 ఎకరాలను ప్రభుత్వం సేకరించించగా.. మరో 710 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఎయిర్‌పోర్ట్ స్థలం జాతీయ హైవేకు ఆనుకొని ఉందని, కార్గో, పాసింజర్ సేవలకు అవకాశం ఎక్కువ ఉందన్నారు. రెండు పోర్టులు ఉన్నందున ఎగుమతులు, దిగుమతులకు అనుకూలంగా ఉంటుందని, ఈ ప్రాంతం పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే బిపిసిఎల్, ఇండోసోల్ సోలార్ వంటి భారీ పరిశ్రమలు వచ్చాయన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగం అయినందున జిల్లాకు ఎయిర్‌పోర్ట్ కల త్వరగానే సాకారం అవుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి ఇంటకి తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కూడా త్వరగా పూర్తయి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ఎయిర్‌పోర్ట్ పూర్తయితే అన్నివిధాలా అభివృద్ధి సాధిస్తుందని వివరించారు.
What's Your Reaction?






