రాబోయే ఐదు సంవత్సరాల్లో విద్యా విధానం దేశానికే తలమానికంగా ఉండే విధంగా మార్పులు తెస్తాం

రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానం దేశానికే తలమానికంగా ఉండే విధంగా మార్పులు తీసుకువస్తామని మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. రాజధాని అమరావతిలోని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలో గురువారం ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50కి పైగా ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లోకేశ్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను ప్రారంభించారు. ప్రధాని పిలుపు మేరకు వికసిత్ భారత్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసేందుకు వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. దీనిలో భాగంగానే అనేక కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. వీఐటీ వ్యవస్ధాపకుడు డాక్టర్ జి.విశ్వనాథన్ మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నత విద్యలో స్ధూల నమోదు నిష్పత్తి పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
What's Your Reaction?






