రాజధాని పనుల పున: ప్రారంభ కార్యక్రమానికి రైతులకు ఆహ్వానం

అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ రాజధాని రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలకమలుపుకాబోతుందని..రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలక అడుగు అవుతుందని సిఎం అన్నారు. రాజధాని రైతుల త్యాగం కారణంగానే నేడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసుకుంటున్నామని....ఎప్పటికీ రైతుల మంచి మనసును రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమం, పనుల్లో భాగస్వామ్యం కావాలని రాజధాని గ్రామాల రైతులను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. మే 2వ తేదీ ప్రధాని చేతుల మీదుగా క్యాపిటల్ పనుల రీ స్టార్ట్ కార్యక్రమం, రైతుల సాధకబాధకాలపై వారితో చర్చించారు. రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల రైతులు ఉండవల్లిలోనివాసంలో ముఖ్యమంత్రి ఆహ్వానంతో సిఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రైతులతో సిఎం చంద్రబాబు చర్చించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి కేటాయించే ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అమరావతి దేవతల రాజధాని
2014లో రాజధాని ప్రకటన తర్వాత రైతులు భూములివ్వకుండా ఉండేందుకు వైసీపీ నేతలు అపోహలు సృష్టించి రెచ్చగొట్టారు. అయినా మాపై నమ్మకంతో రైతులు ముందుకొచ్చి 34 వేల ఎకరాలు ఇచ్చారు. రాష్ట్రం కోసం, మీ జీవితాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో కొత్త నగర నిర్మాణానికి భూములు ఇచ్చారు. రాజధానికి భూములిచ్చిన రైతులు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిని కొనసాగిస్తామని చెప్పి తర్వాత మూడు రాజధానులు, స్మశానం, ఎడారి అని మాట్లాడారు. ఐదేళ్ల మీ పోరాటం, స్థలబలం కారణంగానే అమరావతిని ఏమీ చేయలేకపోయారు. దేవుతల రాజధాని కాబట్టే కదిలించలేకపోయారు. మే 2న రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభానికి ప్రధాని మోదీ వస్తున్నారు. ప్రతిగ్రామం, ప్రతి ఇంటి నుంచి ఈ సభకు ప్రజలు తరలిరావాలి. మే 2 తరువాత రాజధాని నిర్మాణం వేగవంతం అవుతుంది. రైతులకు కేటాయించిన ప్లాట్లు కూడా అభివృద్ధి చేస్తాం” అని సీఎం చంద్రబాబు కోరారు.
ఎయిర్ పోర్టు, స్టేడియం నిర్మాణంతో పెరగనున్న భూముల విలువ
రైతులతో సమావేశంలో రాజధాని అవసరాలకు అదనంగా భూసేకరణ అంశంపైనా చర్చ జరిగింది. ఈ విషయంలో రైతుల అపోహలను సిఎం నివృత్తి చేశారు. ‘గతంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూ సేకరణ జరిగినప్పుడు 5 వేల ఎకరాలు ఎందుకుని కొందరు ప్రశ్నించారు. కానీ ముందు చూపుతో సేకరించబట్టే ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు నిర్మాణంతో పాటు పెద్ద హోటళ్లు, మాల్స్ వచ్చి ఎకనమిక్ యాక్టివిటీ పెరిగింది. దీంతో అక్కడి చుట్టుపక్కల భూములకు విలువ పెరిగి రైతులకు మేలు చేకూరింది. అమరావతిలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం నిర్మాణాలకు మరికొంత భూమి అవసరం అవుతుంది. వీటి అవసరాలకు అనుగుణంగా భూమిని తీసుకోవాల్సి ఉంటుంది. రాజధాని కోసం స్వచ్చంధంగా భూములు ఇచ్చిన రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా, వారికి నష్టం జరిగేలా ఏ కార్యక్రమం, నిర్ణయం ఉండదని సిఎం అన్నారు. ‘కృష్ణానదిపై మరో మూడునాలుగు వారధిలు కూడా వస్తాయి. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు వస్తాయి. ఇతర ప్రాంతాలకు కనెక్టవిటీ పెరుగుతుంది. రాజధాని విస్తరించి పెద్ద ఎత్తున సంస్థలు, పెట్టుబడులు వస్తాయి. అదనపు భూసేకరణ కారణంగా ఈ ప్రాంతంలో ధరలు పడిపోతాయనే అపోహలకు గురికావద్దు. నాకు, రైతులకు మధ్య దూరం ఉండదు. మీ ప్రయోజనాలకు విరుద్దంగా ఏమీ జరగదు”అని సీఎం అన్నారు. రాజధాని ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల త్యాగాలకు గుర్తుగా స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని రైతులు కోరగా...శాతవాహన కాలం నుంచి అమరావతి ఉద్యమం వరకు జరిగిన పరిణామాలన్నీ క్రోడీకరిస్తూ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. అంతేకాకుండా రాజధాని పరిధిలోని గ్రామ కంఠాల్లో ప్రస్తుతం నివాసం ఉంటూ పట్టాలేని వారికి పట్టాలివ్వాలని వారు కోరగా...ఈ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






