రాగిజావపడి విద్యార్థినికి తీవ్ర గాయాలు
రాగిజావ పడి బాలికకు తీవ్ర గాయాలు
కస్తూర్బా గాంధీ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణలు
వలేటివారిపాలెం శిఖర జనసాక్షి : మండలంలోని పోలినేనిపాలెం సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలైన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన ఈనెల 11వ తేదీ జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పాఠశాలలో విద్యార్థినులకు భోజనం తయారు చేస్తున్న సమయంలో వేడిగా ఉన్న రాగిజావ పాత్రను సిబ్బంది పిల్లల చేత పట్టించే క్రమంలో జారి, వేడి రాగిజావ బాలికపై పడినట్లు సమాచారం.ఈ ఘటనలో 9వ తరగతి చదువుతున్న డి. సురక్షితకు శరీరంపై తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వెంటనే పాఠశాల సిబ్బంది బాలికను ఒంగోలుకు తరలించి, ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు.విద్యార్థినులకు భోజనం తయారు చేసే సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, వేడి పదార్థాలను తరలించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని బాలిక తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్నారు . పాఠశాల సిబ్బంది చేయాల్సిన పనిని విద్యార్థినుల చేత వేడి పాత్రలు పట్టించడంతో ఈ సంఘటన జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.విద్యార్థినుల భద్రత విషయంలో పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనలో మొత్తం నలుగురికి గాయాలు కాగా ముగ్గురికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.
What's Your Reaction?