యాచకుడే దాతగా మారి రూ 1 లక్ష విరాళం

యాచకుడే దాతగా మారి రూ. లక్ష విరాళం
-ఇప్పటి వరకు రూ. 9.54 లక్షల విరాళం
జనసాక్షి : యాచకుడే దాతగా మారి మందిర అబివృద్ధికి విరాళం అందజేయటం షిర్డీసాయి బాబావారి మహిమకు నిదర్శనమని ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయి బాబా మందిరం గౌరవా«ధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి అన్నారు. స్ధానిక ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయి బాబా మందిరంలో శుక్రవారం యాచకుడు యాదిరెడ్డి మందిర అభివృద్ధికి గానూ రూ. లక్ష విరాళంను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే బాబా మందిరానికి రూ. 8లక్షల 54వేల 691 విరాళంను యాదిరెడ్డి అందజేశారని ఇప్పుడు మరో లక్ష రూపాయల విరాళం అందజేయటం అభినందనీయం అన్నారు. భక్తులు, దాతల సహకారంతో ఆంధ్రా షిర్డీగా విరాజిల్లుతున్న ముత్యాలంపాడు బాబావారి మందిరంలో కోరిన కోర్కెలు తప్పక నేరవేరుతాయని భక్తుల విశ్వాసం అన్నారు. షిర్డీ వెళ్ళి మొక్కులు తీర్చుకోలేనివారు వారి మొక్కులను ఇక్కడ తీర్చుకుంటున్నారని అన్నారు. షిర్డీలో మాదిరిగా అన్ని అధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాత యాచకుడు యాదిరెడ్డి మాట్లాడుతూ తాను బాబా మందిరం వద్ద యాచించి సంపాదించిన సంపాదన బాబావారికే ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు. తన జీవితం బాబాకే అంకితమని తాను సేకరించే ప్రతీ పైసా దైవకార్యాలకే వినియోగిస్తానని అన్నారు. బాబావారికి సేవ చేసుకునే అవకాశం లభించటం తన అద్షృష్టంగా పేర్కొన్నారు. మందిర అధ్యక్షులు పొన్నలూరి లక్ష్మణరావు, కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి ఆలయకమిటీ సభ్యులు యాదిరెడ్డిని అభినందించారు. అనంతరం బాబావారి శేషవస్త్రం ప్రసాదంతో యాదిరెడ్డిని గౌతంరెడ్డి చేతులమీదుగా సత్కరించారు.
What's Your Reaction?






