మత్స్యకార కుటుంబాలకు రూ 161 కోట్లు ఆర్థిక సహాయం విడుదల

Nov 21, 2023 - 14:36
 0  118
మత్స్యకార కుటుంబాలకు  రూ  161 కోట్లు  ఆర్థిక సహాయం విడుదల

-23,458 మంది మత్స్యకార కుటుంబాలకు రూ. 161 కోట్ల ఆర్థిక సాయం విడుదల

-రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఓఎన్జీసీ ద్వారా నాలుగో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున 6 నెలల సాయం

-సీఎం క్యాంపు కార్యాలయంలో వర్చువల్ గా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

 జనసాక్షి  : ఓఎన్జీసీ సంస్ధ పైప్‌లైన్‌ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఓఎన్జీసీ ద్వారా నాలుగో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున 6 నెలలకుగానూ రూ.69,000, మొత్తం రూ.161.86 కోట్ల ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్‌ నొక్కి వర్చువల్‌గా విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ ఇవాళ ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపుకోవాలని అనుకున్నామని, వర్షాల కారణంగా అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు వివరించారు. మనం ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపు లైన్‌ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ సాయం చేసేందుకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. వాయిదా వేసిన తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద పులికాట్‌ సరస్సు ముఖద్వారాన్ని పూడిక తీసి, తెరిచే కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోనో, వచ్చే నెలలోనో చేపడతామని వివరించారు.

మత్స్యకార కుటుంబాలకు సాయం అందించడం కోసం ఓఎన్జీసీ పైపులైన్‌ నిర్మాణంలో భాగంగా జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయ గోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో 16,408 మంది మత్స్యకారుల కుటుంబాలకు, కాకినాడ జిల్లాలో మరో 7 వేల 50 మంది, మొత్తంగా 23,458 మంది ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తున్నట్లు వివరించారు. నెలకు రూ.11,500 చొప్పున చెల్లించే ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీతో మాట్లాడి, వారితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. మత్స్యకారుల తరపున ఓఎన్జీసీతో మాట్లాడి 3 దశల్లో రూ. 323 కోట్లు నష్టపరిహారం ఇప్పటికే ఇప్పించిన్నట్లు వివరించారు. ఈ రోజు 4వ విడతగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 6 నెలలకు సంబంధించి రూ.161 కోట్లు పరిహారాన్ని నేరుగా ఆయా కుటుంబాల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow