తప్పిపోయిన బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల దగ్గరకు చేర్చిన కందుకూరు పోలీసులు
కందుకూరు శిఖర జనసాక్షి : ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ కనిపించకుండా పోయిన మూడేళ్ల బాలుడిని కందుకూరు పోలీసులు 8 గంటల్లోనే గుర్తించి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. వివరాలలోకి వెళితే కందుకూరు మండలం పలుకూరు గ్రామ పరిధిలోని వడ్డీ పాలెం చివరన ఉన్న ఎస్టీ యానాది కాలనీకి చెందిన ఓబ్బాని జ్యోతి, వెంకటేశ్వర్లు దంపతుల రెండవ కుమారుడు ఓబ్బాని శ్రీహరి (3) సెప్టెంబర్ 24న సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఈ విషయం శ్రీహరి తల్లిదండ్రులు సెప్టెంబర్ 25న ఉదయం పోలీసులకు సమాచారం అందింది.సమాచారం అందుకున్న వెంటనే ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, కందుకూరు డీఎస్పీ బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో కందుకూరు సర్కిల్ సీఐ అన్వర్ బాషా చర్యలు చేపట్టారు. కందుకూరు రూరల్ ఎస్సై బాలకృష్ణ, కందుకూరు టౌన్ ఎస్సై భార్గవ్, ఉలవపాడు ఎస్సై శివయ్యలను మూడు బృందాలుగా ఏర్పాటు చేసి బాలుడి కోసం గాలింపు చేపట్టారు.పోలీసు బృందాలు సమన్వయంతో గాలింపు చర్యలు చేపట్టి, సమాచారం అందిన 8 గంటల్లోపే బాలుడిని గుర్తించారు. అనంతరం బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.తమ కుమారుడిని క్షేమంగా తమ వద్దకు చేర్చడంతో తల్లిదండ్రులు భావోద్వేగానికి గురై పోలీసులకు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. బాలుడిని త్వరితగతిన గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన కందుకూరు డీఎస్పీ, సీఐతో పాటు ముగ్గురు ఎస్సైలను ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.
What's Your Reaction?