తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారంటూ డీఎస్పీకి భారతి ఫిర్యాదు
భర్తను బలవంతంగా తీసుకెళ్లారంటూ డీఎస్పీకి భారతి ఫిర్యాదు
కందుకూరు: తన భర్త ఇంటూరి హరిబాబును గుడ్లూరు సీఐ బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపిస్తూ వలేటివారిపాలెం మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఇంటూరి భారతి కందుకూరు డీఎస్పీ బాలసుబ్రమణ్యంకు వినతిపత్రం అందజేశారు.బడేవారిపాలెంలోని తమ ఇంటికి తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుడ్లూరు సీఐ మరికొందరితో కలిసి ప్రైవేటు వాహనంలో వచ్చి, తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని భారతి ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో విచారించగా తన భర్త అక్కడ లేరని చెప్పారని, ఆయన ఆచూకీ తెలియక ఆందోళన చెందుతున్నానని తెలిపారు. తన భర్తకు రక్షణ కల్పించి, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియజేసి ఇంటికి పంపించాలని, సంబంధిత సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌తో కలిసి ఆమె డీఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు.
What's Your Reaction?