కోవూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Apr 18, 2024 - 15:03
Apr 18, 2024 - 15:37
 0  527
కోవూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

- కోవూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

- తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

- కోవూరులో గెలుపు ఖాయమని వెల్లడి

- పోలీసుల అత్యుత్సాహం

జనసాక్షి  :కోవూరు నియోజకవర్గ ఎన్‌డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి  వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి  ఎన్నికల పర్వంలో తొలి అడుగు వైభవంగా పడింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, జనసందోహం మధ్య కోవూరులోని తహసీల్దారు కార్యాలయంలో 2 సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రశాంతిరెడ్డి వెంట నెల్లూరు పార్లమెంట్‌ ఎన్‌డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌  ఉన్నారు.

- ప్రజల ఆశీర్వాదంతో 

నామినేషన్‌ వేసిన అనంతరం ప్రశాంతిరెడ్డి  మాట్లాడుతూ... కోవూరు ప్రజల ఆశీర్వాదంతో, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మద్దతుతో గురువారం నామినేషన్‌ వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది మా గెలుపునకు, కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి తొలి మెట్టని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో వారికి మంచి చేయాలనే లక్ష్యంతో తాము ప్రజల ముందుకు వచ్చామన్నారు. ప్రజలందరూ తమ పవిత్రమైన ఓటును సైకిల్‌ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 40 ఏళ్ల రాజకీయం అని చెప్పుకునే వాళ్ల చెర నుంచి కోవూరు ప్రజలను విముక్తి చేయాల్సి ఉందని వివరించారు. కోవూరును వివాదరహిత, అవినీతిరహిత నియోజకవర్గంగా మార్చి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా చేయడమే తమ మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. తాను కోవూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని, మాటను తప్పకుండా నిలబెట్టుకుంటానని చెప్పారు.

గెలుపు మనదే..

అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి  మాట్లాడుతూ... తమకు మద్దతుగా ఉన్న కోవూరు ప్రజానికానికి, మూడు పార్టీ నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల మద్దతు చూస్తుంటే గెలిచేది ప్రశాంతిరెడ్డి గారేనన్నారు. కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డిని గెలిపిస్తే ఈ నియోజకవర్గ ప్రజలకు చాలా మేలు జరుగుతుందని చెప్పారు. ఇప్పటివరకు కోవూరు అనుకున్నంత మేర అభివృద్ధి కాలేదని, ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయన్నారు. ఈ నియోజకవర్గంతో పాటు పార్లమెంట్‌ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి కావాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడుగారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి ప్రశాంతిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు.

పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. వేమిరెడ్డి కుటుంబం డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. కేవలం గౌరవం కోసమే పార్టీ మారారని అన్నారు. ఇలాంటి వ్యక్తులు గెలిస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో పనిచేసేందుకు తాము ముందుకు వచ్చామని అన్నారు. కోవూరు నియోజకవర్గం ప్రశాంతిరెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow