‘జల్ జీవన్ మిషన్ పనుల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. ఇప్పుడున్న నీటి వనరులకు కొత్తరూపు తీసుకురావడంతో పాటు కొత్త నీటి వనరులను సృష్టించుకోవడం అవసరం. నీటి నిర్వహణ, సరఫరా విషయంలోనూ పటిష్టమైన ప్రణాళిక ఉండాల’ని ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు అందించాలనే బృహత్తర ప్రణాళికకు అంతా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. జల్ జీవన్ మిషన్ పనులకు ఎలా మొదలుపెట్టాలి... ఎలా ముందుకు తీసుకెళ్లాలి... పటిష్టంగా ఎలా పూర్తి చేయాలనే విషయాలను అధికార యంత్రాంగం సమన్వయం చేసుకొని పనిచేయాలని, కేవలం పనులు చేసి వదిలేయడం కాకుండా, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు (గ్రీవెన్స్) కోసం కూడా ప్రత్యేక సమయాన్ని కేటాయించాలన్నారు. జల్ జీవన్ మిషన్ పథకం సమర్థంగా అమలు చేసేందుకు, జిల్లావారీగా ప్రత్యేక డీపీఆర్ తయారు చేసేందుకు, పథకం ఫలాలను వినియోగించుకునేందుకు అన్ని జిల్లాల పంచాయతీరాజ్, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం అధికారులతో ‘అమృతధార’ కార్యక్రమం వర్క్ షాపును విజయవాడలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరై కీలకోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల తాగు నీటి అవసరాలను గుర్తించి ముందుకు వెళ్లాలి. జల్ జీవన్ పనులన్నీ ప్రజలకు ఫలాలు అందించాల్సిన తరుణంలో వారి సూచనలకు పెద్దపీట వేయాలి. జన వనరుల లభ్యత, వాటి నుంచి పొందాల్సిన ప్రయోజనం, ఇతర అంశాలను నిశీతంగా పరిశీలించి శాశ్వతంగా ఫలితాలు అందేలా జల్ జీవన్ మిషన్ పనులను మొదలుపెట్టాలి.
• ఇప్పటికీ తాగు నీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదు
స్వాతంత్య్రానంతరం భారతదేశం ప్రజలకు తాగు నీటిని అందించేందుకు లక్షల కోట్లను ఖర్చు చేసింది. ప్రతి మనిషికి స్వచ్ఛమైన తాగు నీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. ప్రతి మనిషికీ సగటున రోజుకి 55 లీటర్ల మంచి నీరు అందించాలనే ఉన్నత లక్ష్యంతో 2019లో జల్ జీవన్ మిషన్ పథకం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆకాంక్షల మేరకు మొదలైంది. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం సందర్భంగా కాని, రంజాన్ రోజుల్లో ముస్లిం సోదరులు పాటించే ఉపవాస దీక్షల్లో గాని ఒక పూట నీరు అందకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు. 2008లో ఆదిలాబాద్ తండాల్లో తిరుగుతున్నపుడు చూపులేని ఓ వృద్ధురాలు కాస్త నీళ్లిప్పించయ్యా.. అన్న మాట నాకెప్పుడూ తల్చుకున్నా కళ్లలో గిర్రున నీళ్లు తిరిగేలా చేస్తాయి. నా శాఖల్లో అత్యంత కీలకమైంది.. నాకు ఇష్టమైంది గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి అందించే కీలక బాధ్యత. స్వచ్ఛమైన తాగునీరు అందితే ప్రజల సంతోషం అంతాఇంతా కాదు. వారికి స్వచ్ఛమైన నీరు అందితే చాలావరకు ఇతర సమస్యలు తొలగిపోతాయి. ప్రజలంతా ఆనందంగా ఉండటానికి మంచినీరు అందడం అనేది ప్రధానం.