రవ్వా శ్రీనివాసులకి డాక్టరేట్ ప్రధానం

సేవా హృదయ రవ్వా శ్రీనివాసులుకి డాక్టరేట్ ప్రధానం
జనసాక్షి : తమిళనాడు హోసూర్ లో హోటల్ హిల్స్ లో శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు అధ్యక్షులు సేవా హృదయ రవ్వా శ్రీనివాసులుకి వారు చేస్తున్న సేవలను గుర్తించి ఆదివారం ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా సేవా హృదయ రవ్వా శ్రీనివాసులు మాట్లాడుతూ నా వృత్తి LIC ఏజెంట్, ప్రవృత్తి సమాజ సేవ. మేము 2008 లో విజయవాడలో మా మిత్రులు కొంతమంది కలిసి శ్రీరామసాయిబాబా సేవా బృందముగా ఏర్పడి ఎంతోమంది నిరుపేదలకు ఆకలి తీరుస్తూ ఎన్నో అనాధ వృద్ధాశ్రమాలకి మా వంతు సహకారాన్ని అందిస్తూ, ఎన్నో దైవ కార్యక్రమాలు చేస్తూ మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ,2015 నుండి ప్రకాశం జిల్లా కందుకూరు పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, క్రీడా సామాగ్రి, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనా కారణంగా లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం, అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా ఆకలితో ఉన్న వారి వద్దకే ఆహారాన్ని అందిస్తూ ఎంతోమంది నిరుపేదలకు, పట్టణ పరిసర ప్రాంతంలోని యాచకుల ఆకలిని తీరుస్తున్నామన్నారు.పేదలకు దుప్పట్లు, గొడుగులు పాదరక్షలు అందిస్తూ, పర్వదినాలలో పేదలు కూడా నూతన వస్త్రములు ధరించి సంతోషంగా ఉండాలని వారికి అవసరమైన వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. సాటి వారికి ఆపద వచ్చినప్పుడు మనం చేతనైన సహాయం అందించాలనే ఉద్దేశంతో కొంత మంది వైద్య ఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి దాతల సహాయంతో ఆర్థిక సహాయం అందించడం జరిగింది. పూట గడవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న ఎన్నో అనాధ , మానసిక దివ్యాంగుల, వృద్ధాశ్రమాలకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ, మా కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహాయ సహకారాలతో సేవలు చేయడం జరిగింది. 15 సంవత్సరాలుగా మేము చేస్తున్న వివిధ రకాల సేవలను గుర్తిస్తూ ఈ గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించిందన్నారు.తనకు ఇచ్చిన గౌరవ డాక్టరేట్ సమాజం పట్ల తనకున్న బాధ్యతను మరింత పెంచిందని అన్నారు.
What's Your Reaction?






