నేడు సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపు

Jun 3, 2024 - 22:14
Jun 3, 2024 - 22:22
 0  125
నేడు సార్వత్రిక ఎన్నికల  ఓట్లు లెక్కింపు

- ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా యంత్రాంగం

- నేటి ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం

- ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఈవీఎం ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు

- రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడి

- కౌంటింగ్ కేంద్రానికి చేరిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులు

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌

నెల్లూరు జనసాక్షి : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం కనుపర్తిపాడు లోని ప్రియదర్శిని కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. 

 ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కాలేజీలో మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తామన్నారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఈవీఎం ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. జిల్లావ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజవర్గాలకు కలిపి 7,63,894 పురుషుల ఓట్లు, 7,84,219 మహిళల ఓట్లు, ఇతరుల ఓట్లు 70 మొత్తం 15,48,183 ఓట్లు పోలయ్యాయయని కలెక్టరు వెల్లడిరచారు. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఫలితాలు 20 రౌండ్లలో, కావలి ఫలితాలు 23 రౌండ్లు, ఆత్మకూరు ఫలితాలు 20 రౌండ్లు, కోవూరు ఫలితాలు 24 రౌండ్లు, నెల్లూరు సిటీ ఫలితాలు 18 రౌండ్లు, నెల్లూరు రూరల్‌ ఫలితాలు 21 రౌండ్లు, ఉదయగిరి ఫలితాలు 24 రౌండ్లు, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు 21 రౌండ్లలో వెల్లడికానున్నట్లు చెప్పారు. నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 4 రౌండ్లలో ఫలితాలు వెల్లడికానున్నట్లు చెప్పారు. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు 2 టేబుళ్లు ఏర్పాటు చేయగా 3 రౌండ్లలో ఫలితాలు వెల్లడికానున్నట్లు చెప్పారు. అలాగే కావలికి 2 రెండు టేబుళ్లు 4 రౌండ్లు, ఆత్మకూరుకు రెండు టేబుళ్లు 4 రౌండ్లు, కోవూరుకు రెండు టేబుళ్లు 4 రౌండ్లు, నెల్లూరుసిటీకి 2 టేబుళ్లు 4 రౌండ్లు, నెల్లూరు రూరల్‌కు 6 టేబుళ్లు 2 రౌండ్లు, ఉదయగిరికి 2 టేబుళ్లు 4 రౌండ్లు, సర్వేపల్లికి 2 టేబుళ్లు 2 రౌండ్లలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు వెల్లడికానున్నట్లు కలెక్టరు చెప్పారు. కౌంటింగ్‌ అబ్జర్వర్లు కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. 

 ఎప్పటికప్పుడు ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లండించేందుకు ప్రియదర్శిని కౌంటింగ్‌ కేంద్రంలో మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. పాత్రికేయులకు ఎన్నికల సంఘం జారీ చేసిన మీడియా పాసులు అందించామని, ప్రతిఒక్కరూ తమ పాస్‌ను తప్పకుండా తీసుకురావాలని, పాస్‌ ఉన్న వారినే కౌంటింగ్‌ కేంద్రంలోనికి అనుమతిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. పాత్రికేయులందరూ తమ సెల్‌ఫోన్లలను మీడియా కేంద్రంలోనే ఉంచుకోవాలని, కౌంటింగ్‌ హాలు, స్ట్రాంగ్‌ రూంల వద్దకు సెల్‌ఫోన్లు పూర్తి నిషేధమన్నారు. కౌటింగ్ విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, టీ, స్నాక్స్‌ వంటి భోజన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.  

జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లో ఉందని ఎస్పీ పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు కౌంటింగ్‌ కేంద్రం మూడంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఇందుకు రాజకీయపార్టీలు సహకరించాలని కోరారు. పోలింగ్‌ రోజున ఎటువంటి బందోబస్తు చర్యలు చేపట్టామో అదేతరహాలో కౌంటింగ్‌ రోజున స్టేట్‌, ఆర్మ్‌డ్‌, సిఆర్‌పిఎఫ్‌ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ హైస్కూలు వరకు మాత్రమే పార్కింగ్‌కు అనుమతి వున్నట్లు చెప్పారు. అబ్జర్వర్లు, అభ్యర్థులు, ఎలక్షన్‌ ఏజెంట్ల వాహనాలకు మాత్రం కౌంటింగ్‌ గేటు ముందు 100మీటర్ల వరకు మాత్రం వాహనాలకు అనుమతి వుందని చెప్పారు. భారత ఎన్నికల సంఘం నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ శాంతిభద్రతలకు ఇబ్బందులు లేకుండా సజావుగా కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.  

కౌంటింగ్ కేంద్రానికి చేరిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులు

జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో భద్రపరిచిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించిన బాక్సులను నెల్లూరు కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలోని స్ట్రాంగ్ రూములకు చేర్చారు. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల సమక్షంలో భారీ బందోబస్తు నడుమ ఈ బాక్స్ లను ప్రియదర్శిని కళాశాలలోని స్ట్రాంగ్ రూములకు చేర్చి భద్రపరిచారు. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి కలెక్టరేట్లో భద్రపరిచిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కూడా డిఆర్ఓ లవన్న సమక్షంలో ప్రియదర్శిని కళాశాలలోని స్ట్రాంగ్ రూమునకు చేర్చి భద్రపరిచారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఈ పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow