మౌలిక సదుపాయాలు లేకుండా పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ఎలా ముందుకు వస్తారు?

Feb 22, 2024 - 12:06
Feb 22, 2024 - 12:28
 0  24
మౌలిక సదుపాయాలు లేకుండా  పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామిక   వేత్తలు  ఎలా ముందుకు వస్తారు?

కనీస మౌళిక సదుపాయాలు లేని గ్రోత్ సెంటర్లో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ఎలా వస్తారు??? 

జన సమీకరణ కాదు - జనం కోసం ఆలోచించండి...లోక్ సత్తా

         జనసాక్షి :  విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉన్న గ్రోత్ సెంటర్లో మౌళిక సదుపాయాలు చాలా అద్వాన్నంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పారిశ్రామిక వేత్తలు ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు అని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. ప్రజా సంకల్ప వేదిక-సమాచార హక్కు చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి సురేష్ తో కలిసి గ్రోత్ సెంటర్ ని పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రోత్ సెంటర్లో ప్రధాన రహదారులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి, విద్యుత్ దీపాలు సరిగ్గా లేవు, పచ్చదనం పూర్తిగా కనుమరుగయ్యింది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది అన్నారు. గత తెలుగు దేశం ప్రభుత్వం గాని ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఈ గ్రోత్ సెంటర్లోని మౌళిక సదుపాయాలు కల్పించడంలో అలాగే కొత్త పరిశ్రమలు ఏర్పాటు చెయ్యడంలో పూర్తిగా విఫలం అయ్యాయని అన్నారు. పారిశ్రామిక వేత్తలను ఆకర్షించి పరిశ్రమలు పెట్టించాలంటే ముందు మౌళిక సదుపాయాలయిన రహదారులు, నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ దీపాలు, మంచినీటి సరఫరా, కాలువలు, మొక్కలను పెంచి చక్కటి పచ్చదనం ఉండేటట్టు ఏర్పాట్లు చెయ్యాలి. అలాగే గ్రోత్ సెంటర్ ప్రధాన ద్వారం దగ్గర మొత్తం ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఖాళీగా ఉన్న ప్లాట్ల వివరాలతో ఓ మ్యాప్ ఏర్పాటుచేస్తే పరిశ్రమలు పెట్టాలనుకున్నవారికి ఓ అవగాహన వస్తుంది. కనీసం ఆ దిశగానయినా మన పాలకులు, అధికారులు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం.

           రానున్న ఎన్నికల్లో మన బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న నాయకులకు లోక్ సత్తా పార్టీ తరపున విజ్ఞప్తి. ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా గతం వదిలేసి, మిమ్మల్ని బొబ్బిలి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరు బొబ్బిలి నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో ప్రజలకు చెప్పి ఓట్లు అడగండి. అలాగే ఈ గ్రోత్ సెంటర్లో మౌళిక సదుపాయాలు కల్పించడానికి మీ ప్రణాళిక ఏమిటి? ఇక్కడ ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తారు? ఎంత మంది యువతకు ఉపాధి కల్పిస్తారో ప్రజలకు చెప్పండి. మా పార్టీలో ఇంత మంది చేరారు, మా పార్టీలో అంత మంది చేరారు అనేది కాదు ప్రజలకు కావాల్సింది. మీరు ప్రజల బ్రతుకులు మార్చడానికి ఏం చేస్తారు? మన నియోజకవర్గం, మన ఊరు అయిన బొబ్బిలి అభివృద్ధికి ఏం చేస్తారో అది కావాలి ప్రజలకి. జిల్లాలో అతి పెద్ద మునిసిపాలిటీ అయిన బొబ్బిలి అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. కనీసం ఇకనైనా నాయకులు విజ్ఞతతో ఆలోచించి రానున్న ఎన్నికలలో ఎవరు గెలిచినా కూడా మన బొబ్బిలిని అన్ని రంగాలలో అభివృద్ధి చెయ్యడానికి తమ శక్తి మేర కృషి చెయ్యమని మనస్పూర్తిగా కోరుతున్నాను.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow